పుట:Ganapati (novel).pdf/292

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

291

నావకాయగూనకు జేరఁబడి కూరుచున్న యవస్థలోనే తన్ను గూర్చి జరుగుచున్న గొడవ వినఁబడకుండ నంత గాఢనిద్ర యెట్లు వచ్చెనని మీకుఁ దోచవచ్చును. గణపతియొక్క నిద్రాసుఖముఁ గూర్చి మీరు సంపూర్ణముగ నెఱుగరు. కాన మీ కట్టి శంకలు పొడముచుండును. నిద్రావిషయమున గణపతికి గల యసాధారణ శక్తి వర్ణనాతీతమై యుండును. అతఁడు నడచుచు నిద్రపోగలఁడనుట యతిశయోక్తి కాదు. కూరుచుండి నిద్రింపఁ గలడనుట కవి చాతుర్యము గాదు. భోజనము సేయుచు సుషుప్త్యవస్థయం దుండఁగల డనుట వర్ణనా చమత్కృతి గాదు. లక్షలు, కోట్లు నల్లులు గల మంచము మీఁద నే విధమయిన పరుపు గానిఁ దుప్పటి గాని లేకుండ నతనిం బండుకొన బెట్టుడు. ఆ నల్లు లన్నియు నతని శరీరమందంతట సముద్రముమీఁద దెప్పునఁనదేలి చెరలాడు చేపలవలె నిట్టటు బరుగులెత్తుచు నతనిం గరచుచు, నెత్తురు పీల్చుచున్నను నతఁడు కదలఁడు మెదలఁ డొత్తిగిల్లఁడు. ఇట్టి నిద్రాసుఖము ప్రపంచమునం దెవరికిఁ గలదు? ఒక నల్లి మంచముమీఁద నున్నంత మాత్రమున నిద్రపట్టదని దీపము చేతపుచ్చుకొని యానల్లిం బొడిచి కడతేర్చినదాక మంచముపై మఱల బండుకొనని మహాత్ము లనేకులు గలరు. నల్లులే కాదు. జుమ్మని దోమలు ముసరి, తమ విపరీత గానముచేత నిద్రా దేవతకు భయము గల్పించి యా గదిలోని కామెను రాకుండఁ జేసినప్పుడు సయితము గణపతికి నిద్రాదేవికి నెట్టి