పుట:Ganapati (novel).pdf/291

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

290

గ ణ ప తి

మీ దిక్కుమాలిన కొంపలో నుండబట్టి నాకిన్ని పాట్లు కలిగినవి. అనవుడు మహాదేవశాస్త్రి తల్లి "కొడు కా వరసని కుండలు మైలపరచినాడు; తల్లి దిక్కుమాలిన కొంప యని తిట్టుచున్నది. ఇద్ద రిద్దరే. వీళ్ళ కేమి వినాశకాలమో కాని పొండి, మా యింట్లో నుండి లేచిపొండి" యని పలికెను.

పదిహేడవ ప్రకరణము

నిద్ర పరమసుఖప్రద మనియు నా రోగ్య ప్రదాయిని యనియు సర్వావస్థలయందు నపేక్షనీయ మనియు మన మందర మెరుగుదుము. మరియు నిద్రవచ్చినప్పు డీ స్థల మా స్థల మనక మెట్టయనక పల్లమనక పాను పనక వట్టినేల యనక తలగడలు మొదలగున వున్నవనక లేవనక మనుష్యుఁడు మైమఱచి గాఢ సుషుప్తి నొందుననియు మన మెరుగుదుము. కాని, వ్యాధియు మనోవ్యాధియు భయము మున్నగునవి పీడించు నప్పుడు మనుష్యునకు సాధారణముగా నిదురరాదు. మానవుఁ డట్టివానికి లోనగునప్పుడు నిశాసమయ మతిదీర్ఘమై చట్రాతివలెఁ గదల నట్టులుండి, నిద్రను మనుజుని సన్నిధికిని రానీయ త్రోసి వేయును. ప్రకృతిధర్మ మిట్లుండగా బడిలోని పిల్లవానిని జావఁ గొట్టినందుకుఁ దన్నా బాలుని తండ్రి చంపివేయు నని యతిభయ భ్రాంతుడై విహ్వలచిత్తుడై యటకమీఁద కెక్కిన గణపతికి