పుట:Ganapati (novel).pdf/290

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

289

అచ్చటనే యున్న గణపతి తల్లి యప్పలుకులు చెవినిబడగానే "యేఁడి యేఁడి ? నా నాయన యేడీ? నా బంగారు తండ్రి యేఁడి? బ్రతికియున్నాఁడా? నాయనా! మూఁడు తవ్వ లావు నేతితో వెంకటేశ్వర్లువారికి దీపారాధన చేసుకుంటాను. క్రిందికి రమ్మను, నయనా!" యని సంతోషించి యిష్టదైవతమునకు మ్రొక్కికొనెను; కుండలదగ్గర గణపతి కూర్చుండి నాఁడని వినిన తోడనే మహాదేవశాస్త్రి తల్లి మిక్కిలి కవలి "అయ్యో అయ్యో! మన యావకాయ తగులుబడిపోయినదిరా, నాయనా! వీఁడమ్మకడుపుకాలా! కుండలు మైలపరిచినాఁడు. ఆ పాడుగుడ్డలతో ముట్టుకొన్నాడు కాఁబోలు. ఈ దిక్కుమాలిన పంతులుకు బస యియ్యవద్దని నేను మొత్తుకొన్నాను. కాని మావాడు నామాట విన్నాఁడు కాఁడు. ఈ యే డావకాయ లేకుండా గొడ్డన్నము తినవలసివచ్చినది. వాడి మొగముమండా, ఆవకాయ కుండదగ్గర కూర్చుండవలెనని యెలా తోచిందమ్మా, వీడికి? ఇంకా నయము నూతిలోఁ గూర్చుండినాఁడు కాఁడు. నూతెడు నీళ్ళు మైలపడిపోను! ఈపాటికి దింపండి, చచ్చుపీనుగును!" అని కేకలు వేయజొచ్చెను. ఆ కఠినోక్తులు తల్లి కెంతో మనస్సంకటము కలిగింప నామె యిట్లనియె "అమ్మా ! నాకొడుకు గనఁబడక నేనెంతో దుఃఖపడుచుండగా నాపుణ్యముచే కనఁబడినాఁడని సంతోషపడుచున్నాను. అలాటి తిట్లు తిట్టకమ్మ. ఒక్క బిడ్డ. వాని నాధారము చేసికొని బ్రతకదలఁచుకున్నాను.