పుట:Ganapati (novel).pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

28

గ ణ ప తి

పూర్వులందరికంటె గొప్పవాఁడనిపించుకొనెను. పాపయ్యకు దక్కిన వేదాధ్యయనమన్నఁ దలనొప్పి. స్వాధ్యాయ మతని చెవిని బడినప్పుడు “ఈ బ్రాహ్మణులు చెవి గోసిన మేకల వలె యఱచు చున్నారు. వీళ్ళ గొంతులు కోయ” యని విసుఁగుకొనుచుండును. సామగాన మతని చెవిని బడినప్పుడు “వీళ్ళపాట తగులఁబెట్ట, ఏడిచినట్లె యున్నదిరా” అని తిట్టుచుండును. అతని వేదమున కొక్కటే స్వరము. కాని యిన్ని స్వరములు లేవు. అందుచేత నతనికిఁ దక్కిన స్వరములు సామము, నసహ్యములు, బ్రాహ్మణు లందరు యజన యాజనాధ్యయనాధ్యాపక ప్రతిగ్రహ షట్కర్మ నిరతులైనను నియోగులు మొదలగువారు యజ్ఞము చేయుటయె గాని చేయించుట మానిరి. వేదాధ్యయన మాచరించుటయె గాని యధ్యాపకత్వము మానిరి. దాన మిచ్చుటయె కాని పుచ్చుకొనుట మానుకొనిరి. వైదికు లీ షట్కర్మలు గూడదని శంక దెచ్చుకొని షట్కర్మలలోఁ గొన్ని కర్మలు దాముకూడ విడిచి కొన్నిటిని మాత్రమే గ్రహించెను. ఎన్నివిడిచి యెన్నిగ్రహించె నని మీ రడుగవచ్చును. అయిదింటిని విడిచి యాఱవది యగు దాన ప్రతిగ్రహము మాత్రము గ్రహించెను. ఆఱింటిలో మూఁడు కర్మలను విడిచిమూడింటిని స్వీకరించుటకు నియోగులకెంత యధికారముకలదొ ఐదింటిని విడిచి యొక్కటి స్వీకరించుటకు మా పాపయ్యకు నంత యధికారమె కలదు. ఇట్లనుటచేతఁ దక్కిన పంచకర్మల నత