పుట:Ganapati (novel).pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

27

లేకుండ గాదులలోఁ బోసి కష్టపడి నిలువఁ జేసికొన వలసిన యగత్యము లేకుండ వారి కుటుంబమునకే దినమునకుఁ గావలసిన బియ్య మాదినమున నక్షయపాత్ర ప్రసాదించుచుండెను. వేదశాస్త్రసమ్మతమైన యట్టివృత్తి నవలంబించి వారెన్నో తరములు సుఖజీవనముచేసిరి. గణపతి పూర్వులలో నతని పితృపితామహుల చరిత్రము దక్క దక్కినవారి చరిత్రములు లభించినవి కావు. అతని పితామహుని పేరు పాపయ్య, పప్పుభొట్లవారు వైదికు లగుటచేత సాంగవేదా ధ్యయనము వారి కవశ్య కర్తవ్యమయినను వారు యజుస్సా మాధర్వణ వేదమును విడిచి ఋగ్వేదమునం దెనిమిదవ యఠ్ఠమును విడిచి తొమ్మిదవ యఠ్ఠమును మాత్రము విడువక ప్రాణపదముగ నెంచుకొని పారాయణముఁ జేయుచు వచ్చిరి. ఆ యఠ్ఠములో మన పాపయ్యకుఁగల ప్రజ్ఞ యసాధారణము. పదము క్రమము జట చెప్పఁగలడని చెప్పనే యక్కఱలేదు. ఆ యఠ్ఠములో నతడు ఘనాపాఠీ యని బిరుదుపొందెను. ఆరంభించినాఁడంటే గుక్క తిరగకుండ నోరు తడబడకుండ గొంతెండి పోకుండ గంటలకొలది కాలము పారాయణము జేయఁగలడు. అందఱుఁ జదివిన వేదమే పాడినదేపాడరా యన్నట్లు తానును జదివిన పక్షమున నందు గౌరవములేదని పప్పుభొట్ల వారీ యఠ్ఠమును ప్రత్యేకముగ వల్లించిరి. వంశ క్రమాగతమైన విద్యయగుటచేతను విశేషించి బుద్ధిజాతి మిక్కిలి గొప్పదగుట చేతను పాపయ్య కొన్ని కొన్ని క్రొత్త పనసలు కనిపెట్టి