పుట:Ganapati (novel).pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

26

గ ణ ప తి

జ్ఞప్తికిఁ దెచ్చుకొని యా స్థిరాస్థి విద్యయేమో యనుకొని భ్రమపడుదురుకాఁబోలు, అట్టి భ్రమలో బడవద్దు. పప్పుభొట్ల వారి పితృపితామహులు సంపాదించినది విద్యాధనము కాదు. అది వేదోక్తమైనది. అందుచేత శ్లాఘాపాత్ర మైనది. "బ్రాహ్మణస్య ధనం భిక్ష" మని మీ రెప్పుడును వినలేదా? శాస్త్రములు శిష్టాచారమును ననుసరించి వీలగు నంత వఱకు నడచుటయే వారికిఁ బరమధర్మ మగుటచే నితర బ్రాహ్మణుల వలె మ్లేచ్చభాషలు నేర్చికొని యుద్యోగములు సేయుట, కాఁపు వృత్తియగు వ్యవసాయము జేయుట మొదలగు నశాస్త్రీయ వ్యాపారములయందు వారు దిగక యక్షయపాత్రమునే వారు నమ్ముకొనిరి. భూములు సంపాదించిన పక్షమున నవి కొడుకులో మనుమలో యన్యాక్రాంతమును జేయ వచ్చును. ధనమార్జించిన పక్షమున నదియుఁ బుత్రపౌత్రులు పాడుచేయవచ్చును. లేదా చోరగ్రస్తము కావచ్చును. అక్షయపాత్ర పైవిధముగ నన్యాక్రాంతము చేయుటకు వీలులేనిదని చిరకాలము దీర్ఘాలోచనముఁ జేసిన మూలపురుషుఁడెవ్వఁడో తన వంశమువారికి స్థిరమై యుండునట్టి వృత్తినేర్పరచవలయునని యావృత్తి స్వీకరించెను. నాగలి పెట్టి నేల దున్నకుండ విత్తనములు చల్లకుండ వాన కురిసినది లే దన్న బెంగ లేకుండ మిడతలదండు మొదలగునవి వచ్చి పడునన్న విషాదములేకుండా నిద్రలేనట్లు రాత్రులు కాపు గాయకుండఁ బెట్టుబడి యక్కరలేకుండ దంపుకొన వలసిన యవసరము