పుట:Ganapati (novel).pdf/268

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

267

పిల్లలకు గణపతి యాజ్ఞాపించెను. బాలబోధ చదువువారికి రెండవ పాఠపుస్తకము చదువువారిని గురువులుగఁ జేసెను. ఇంటిదగ్గఱ తల్లి దండ్రులయొద్ద రుక్మిణీకల్యాణము దాశరథీ శతకము మొదలైనవి చదువుకొనివచ్చినవారిని వారికంటెఁ గ్రిందివారి కొజ్జలుగ నేర్పఱచెను. తాను కలము కాగితముబుచ్చుకొని గాని యాకుగంటము బుచ్చుకొని గాని యెన్నఁడు వ్రాసి యెఱుఁగడు. వ్రాత వ్రాయవలసి వచ్చినపుడు పెద్దపిల్లలచేత చిన్న పిల్లకు వరవళ్ళు పెట్టించును. ప్రధానోపాధ్యాయుఁడు పాఠశాలలో బాఠములు చెప్పకుండ దానొక యుపద్రష్టయై సర్వము జక్కఁగా జరుగుచున్నదో లేదో కనుగొనవలసినదని నేటికాలమున బయలువెడలిన క్రొత్త సిద్ధాంతమును మొట్టమొదట కనిపెట్టిన మహాత్ముఁడు గణపతియే యనిమీరు నిశ్చయముగ నమ్మవలయును. గణపతి బడికి బోయినది మొదలుకొని గోడకు జేరబడి దౌడలు నొప్పులెత్తు వఱకుఁబొగచుట్టలు కాల్చును. దౌడలు నొప్పులెత్తిన తరవాత గోడకు జేరఁబడి కొంతసేపు చాపమీఁదఁ బండుకొని నిద్రపోవును. పిల్లల యల్లరి వల్లగాని దానంత టదిగాని నిదుర మెలఁకువ వచ్చిన తరువాత రామరావణ మహా సంగ్రామమున బలాత్కారముగా నిద్ర నుండి మేల్కొలుపఁబడిన కుంభకర్ణుఁడు వలె నల్లరిచేసిన వారిని జేయని వారిని గలిపి దూదేఁకిన తెఱగున నేకి విడిచిపట్టును. బడి కాలస్యముగ వచ్చినవారిని "నీవింత జాగేల