పుట:Ganapati (novel).pdf/267

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

266

గ ణ ప తి

సంసారము చేయుచుండుటచే వారి కిచ్చిన ధాన్య మాటుట కష్ట మయ్యెను. ఏఁడాదికి గ్రామవాసులు పుట్టెడు ధాన్య మిచ్చునట్లు మహాదేవశాస్త్రి యేర్పాటుచేసి మూడు మాసముల కొక యేదుము ధాన్యము చొప్పున నిచ్చుటకు నిర్ణయము చేసి ముందుగ నొక యేదుము వారి కిప్పించి తమ యరుగుమీఁదనే బడి పెట్టించెను.

పదహారవ ప్రకరణము

బడి పెట్టకమునుపె గణపతి కాలువయొడ్డునకు బోయి మంచి యీతబెత్తములు రెండు మూఁడు విరిచి యాకు లూడదీసి నున్నగా జేసి యెకటి చేత బట్టుకొని బడికివచ్చి కొబ్బరి యాకుల చాపమీద గూర్చుండెను. ఉపాధ్యాయుని రూపురేఖా విలాసములు చూచినతోడనే బెత్తపుదెబ్బ లక్కఱలేకయె బాలకుల కడలు జనించెను. ఈ బెత్తము చేతబూని కూర్చుండిన గణపతి బాలురకు సాక్షాద్దండధరుఁడట్లు తోఁచెను. పంతులు దండధరుఁ డైనపుడు పాఠశాల యమలోకము నరకలోకము నగుట యొక యాశ్చర్యములోనిది కాదు. అక్షరములు రాని పిల్లల కక్షరములు బూడిదలోవ్రాసి యివ్వవలసిన దనియు వ్రాసిన యక్షరములు దిద్దించి నోట పలికించవలసిన దనియు పుస్తకములు పట్టిన