పుట:Ganapati (novel).pdf/261

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

260

గ ణ ప తి

వశము జేసికొని యర్థరాత్రమునఁ గోట గోడలు దాటించి తీసికొనిపోయి పరిణయము జేసికొనెను. నరనారాయణాంశ సంభూతులగు పార్థవాసుదేవులును, నుత్తమక్షత్రియుడైన వత్సరాజును, వివాహము నిమిత్తము కక్కుర్తిపడి దొంగపనులు చేయఁగాఁ దనకుఁ బెండ్లి కాదను భయమున గణపతి వంటివాడు కక్కుర్తిపడి పిల్ల నెత్తుకొని పోవుట తప్పా? కృష్ణార్జునులు రాక్షసవివాహములు చేసికొని రనియు, దుష్యంతుడు గాంధర్వవివాహము చేసికొని ననియు, శాస్త్రము లా వివాహము లంగీకరించు చున్న వనియు మీ రనవచ్చును. మహాపురుషులు చేసిన యపరాధములకు మహర్షు లేదో గతి కల్పించిరి. గాని మా గణపతి చేసిన పనియే చేసిరి. వారి కార్యములు దోషములైన పక్షమున వీని కార్యములును దోషము లగును. వారి వివాహములు నిర్ధుష్టములయిన పక్షమున వీని వివాహము నిర్దుష్ట మగును.

ఇది యటు లుండనిండు. గణపతియొక్క భవిష్యజ్జీవితమును గూర్చి విచారింతము. మాతాపుత్త్రులు మూడుదినములహోరాత్రములు విచారించి, పౌర్వాపర్యములు బరీక్షించి, యౌగాముల నరసి, మంచిచెడ్డలు మదిలో దర్కించి, మహాదేవశాస్త్రి యొక్క యాలోచనం గూడఁ గైకొని యేనుఁగుల మహలు విడిచి, వానపల్లి గ్రామమున నివాసము చేయుటకు నిర్ధారణ చేసిరి.