పుట:Ganapati (novel).pdf/259

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

258

గ ణ ప తి

చున్నా రేమో యని భయమగుచున్నది. ఇతర చారిత్రములు బట్టి యతఁడు నీచుఁడో ఘనుఁడో చదువరులు నిర్ణయింపఁనగును గాని, యీ వివాహముచేతనే నీచుండని నిర్ణయింపరాదు. ఏలయన దమకు గూర్చునట్టి కన్యల దొంగిలించుకొనిపోయి పెండ్లియాడిన వారిలో గణపతియే ప్రప్రథముఁడు గాఁడు. ఈతనికంటె బూర్వులనేకులు గలరు. కలరని చెప్పినంతమాత్రమునే కథకునిపై గౌరవము కలిగి యాతని వాక్యంబులు పరమప్రమాణంబు లని విశ్వసించునట్టి మంచికాలము గతించుటచేతను దగిన దృష్టాంతరములు, నుదాహరణంబులు చూపినం గాని యెట్టివారి మాటకైన జిన్న పిల్లవాఁడు సైతము నమ్మని పాడుదినములు వచ్చి యుండుట చేతను నట్టివారు పూర్వు లనేకులు గల రని ఋజువు చేయుటకుఁ గొన్ని యుదాహరణము లిచ్చుట మంచిది. ధర్మసంస్థాపనంబు జేసి శిష్టజనుల ననుగ్రహించి, దుష్టజనుల నిగ్రహించి, భూభారమడంచు తలంపున శ్రీమన్నారాయణాంశమున మహీమండలమున యదుకులమున నవతరించి, కంసశిశుపాల దంతవక్త్ర జరాసంధ ప్రముఖులైన దుష్టుల బరిమార్చి, బ్రహ్మర్షి రాజర్షి దేవర్షి గణములచేతను, భీష్మాదులచేతను గొనియాడబడిన వాసుదేవుడు విదర్భరాజు శిశుపాలున కియ్యఁ దలంచిన రుక్మిణి నెత్తుకొనిపోయి వివాహము జేసికొనుట జగత్ప్రసిద్ధమే కదా! మహేంద్రుడు పుష్కలావర్త మేఘములతో వచ్చినను వాని నొక పూరికైనఁ గొనక ఖాండవవన మగ్నిహోత్రున కర్పించిన ధైర్యసాగ