పుట:Ganapati (novel).pdf/256

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

255

ఈ యవక తవక కూతలకు కోతలకు వట్టి వెఱ్ఱిముండవు గనుక నీవు భయపడు చున్నావు కాని యెఱిగిన వా రెవ్వరు భయపడరు. ‘వెధవ నాగన్న కాఁబోలు వెలఁదిమగఁడు’ అన్నట్లు నాగన్న సంగతి యెవ్వ రెఱుఁగరు. వీరు గణపతిని చంపితే సర్కారువా రురితీయక మానుదురా? భయపడకు వెళ్ళు. గణపతి ప్రాణానికి నా ప్రాణ మడ్డము వేయగలను. ఏ భయము లేదు. మంగళసూత్రాలు తెంపివేసినాడు గాఁబోలేమి? తెంపనీ తెంపనీ ! కోర్టులో వ్యాజ్యము వేసి నాగన్న తాడు నేను తెంపుతాను. నీవు వెళ్ళు భోజనముచేసి, మా యింటికి రా. గణపతిని నేను తీసికొనివచ్చి నీ కప్పగింతునులే” యని ధైర్యము చెప్పి యామెను పంపెను.

పంపి, యానాటి సాయంకాలము బయలుదేఱి పుల్లయ్య వానపల్లి వెళ్ళి మహాదేవశాస్త్రి యింట మనుకుడుపు పెండ్లి కొడుకైయున్న గణపతిని జూచి మేనమామ యాడిన నాటకమంతయు దెలిపి యిట్లనియె,--

"నీ మేనమామ మోటముండకొడుకు. నీవు కంటబడితివా చప్పున దుడ్డు కఱ్ఱతో బుఱ్ఱ బద్దలు కొట్టగలఁడు. నెత్తి పగిలెనా ప్రాణము పోగలదు. తల్లి కొక్కడవు. ఆ ముసలి ముండ నిన్నే నమ్ముకొని యున్నది. కనుక నీవా గ్రామము పది దినములఁదాక రావద్దు. కాని మీ యమ్మ నిన్ను చూడవలెనని యేడ్చుచున్నది. దానినే నీదగ్గరికి పంపించెదను. పిల్ల పుస్తెలు తెంపివేసినా డని విచారింపకు ! నే నెక్కడో నొక