పుట:Ganapati (novel).pdf/255

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

254

గ ణ ప తి

ప్రతినలు సలుపుచు వీథి ప్రహ్లాద నాటకములో నరసింహమూర్తి చిందులు త్రొక్కినట్లు చిందులఁ ద్రొక్కి పరుగు లెత్తినట్లు పరుగులెత్తెను. నరసింహమూర్తిని బట్టుకొన్నట్లు చూడవచ్చినవారాయనను బట్టుకొని నాటకము సమాప్త మైన దని ప్రేక్షకులొక్కరొక్కరే వెడలిపోయిరి. అన్నగారి ప్రతిజ్ఞలను, వదినెగారి తిట్లను గణపతియొక్క తల్లి ప్రక్కయింటి దొడ్డిలోనుండి విని, తన సోదరుఁడు కొడుకుం జంపివేయు నేమో యని భయపడి చప్పు చప్పున సోదర జ్ఞాతి యగు పుల్లయ్య యింటికిఁబోయి "పుల్లయ్యన్నయ్యా! నా మాటేమి చెప్పినావురా, నాయనా! గణపతిని మావాడు చంపి నెత్తురు బొట్టు పెట్టెకుంటా నని ప్రతిజ్ఞ చేసినాడు. నాబిడ్డను బ్రతికించరా, నాయనా! నాకు పుత్రభిక్షము పెట్టరా నాయనా! నే నేమి జేతునోయి పుల్లయ్య తండ్రీ ! నా గణపతిని నాకప్పగించవోయి పుల్లయ్యతండ్రీ! ఈ పెండ్లి వాడి ప్రాణముకోసమొచ్చింది గాబోలునోయి నాయనా? పెండ్లి లేకపోయినా బ్రతికిపోదువోయి తండ్రీ! వాడెక్కడున్నాఁడో చూపించవోయి తండ్రీ! వాడు కనబడకపోతే నేను బ్రతకలేను, నాయనా!" యని పలువిధముల విలపించి వానిని రక్షింపుమని వేడికొనెను. ఆమె దీనాలాపములువిని పుల్లయ్య "ఓసీ వెఱ్ఱి ముండ! నీవింత తెలివితక్కువదానవు గనుకనే వాండ్లు నిన్నీ లాగున యేడిపించినారు. నాగన్న పరవళ్లు తొక్కగానే సరటే? చంపుతా ననగానే చంపగలడా? నెత్తురు బొట్టు పెట్టుకోగలడా?