పుట:Ganapati (novel).pdf/251

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

250

గ ణ ప తి

నూరడింప వచ్చిరి. అన్నము వండుకొనక పొరుగువారు తమ యింటిలోఁ దినుమని బలవంత పెట్టినను దినక మూఁడుజాముల రాత్రివరకు శోకించి దుఃఖభారము చేతను నిద్రాభారము చేతను తెల్లవారు జామునఁ గన్ను మూసిరి. ఆప్తబంధువులు మృతి నొందుదురుగాక; సర్వస్వము నష్టమౌగాఁక ! మనుష్యుఁడు క్షుత్పి పాసానిద్రలకు మాత్రము లోఁబడక తప్పదుగదా! నాలుగు గడియలు వారికి గాఢమగు నిద్రపట్టెను. అప్పుడు పుల్లయ్య బుచ్చమ్మను భుజముమీఁదఁ బండుకొనఁబెట్టుకొని యెవ్వరు జూడకుండ నామెను నాగన్నగారి వీథి యరుగుఁమీఁద బండుకొనఁ బెట్టి పోయెను. బుచ్చమ్మ నిద్రావశమున నొడ లెరుఁగక యా యరుఁగు మీఁద గొంతసేపు పండుకొని మెలకువవచ్చి "అమ్మా! " యని పిలిచి గట్టిగా నేడువఁ జొచ్చెను. అప్పుడు నాగన్నకు మెలకువ వచ్చెను. అతడు తలుపు తెఱచి చూచునప్పటికి వెదకఁబోయిన తీఁగ కాళ్ళకుఁ దగిలినట్లు తనయరుఁగుమీఁదనే కనఁబడెను. "పిల్ల దొరికినది. పిల్లదొరికినది లేవవే!" యని కేకలు వేయుచు బిడ్డ నెత్తుకొని 'అమ్మాయి ! యెక్కడికి వెళ్ళినావు? ఎవరు తీసుకొని వెళ్ళినారు?' అని యడుగుచు లోపలకు దీసికొని పోయెను. గంగమ్మ భర్త కేకవిని, కలవరపడుచు లేచి "ఏదీ నాచిట్టితల్లి వచ్చిందా?" యని విసవిస భర్తకడకుఁ బోయి యాతని చంకనున్న బిడ్డను దానెత్తుకొనెను. తల్లిం గౌఁగిలించుకొని బిడ్డయు, బిడ్డను గౌఁగిలించుకొని తల్లియు నేడ్చిరి.