పుట:Ganapati (novel).pdf/250

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

249

దేవశాస్త్రి యింటికి వెళ్ళి యక్కడ నొక మంచముమీఁద దానినిఁ బండుకొనబెట్టి తాను గణపతియు మహాదేవశాస్త్రియు మంగళంపల్లి నరసయ్యయుఁ గలసి భోజనము చేసిరి. భోజన మగునప్పటికి రెండుజాముల రాత్రి యయ్యెను. గణపతిని రెందు మూడు దినముల వర కక్కడనే యుండుమని చెప్పి పుల్లయ్య బుచ్చమ్మను దీసికొని బండి కట్టించుకొని మరల స్వగ్రామమునకు బయనమైపోయెను.

అక్కడ దీపాలవేళకు బిడ్డయింటికి రానందున గంగమ్మ చుట్టుప్రక్కల యిండ్లకుఁబోయి "మాపిల్ల మీయింటికి వచ్చినదా? మీ యింటికి వచ్చినదా?" యని యడిగెను. మాయింటికి రాలేదని కొందరు, వచ్చి యాడుకొని నాలుగు గడియల ప్రొద్దువేళనే వెళ్ళిపోయిన దని మరికొందరు చెప్పిరి. అంతకంతకు గంగమ్మకు భయమయ్యెను. కన్నుల నీరు పెట్టుకొనుచు గ్రామము నాలుగు మూలల వెదకెను. ఎవ్వరింటను బిడ్డ కనఁబడలేదు. నాగన్న కా వర్తమానము తెలిసి యతఁడు గూడ పరుగు పరుగున వచ్చి గ్రామమందలి గృహము లన్నియు వెదకుటయే గాక దొడ్లు, పొలములు, తోటలు, నూతులు, గోతులు వెదకెను.

ఎక్కడ వెదకినను బిడ్డ కనబడలేదు. బిడ్డ నెవ్వరో ద్వేషముచేతనో కాళ్ళనున్న చిన్నయందెల కాసపడియో చంపి పారవైచి యుందురని నిశ్చయించి యాలుమగలు మిగుల దుఃఖింప జొచ్చిరి. చుట్టుప్రక్కల వారందరు వారి