పుట:Ganapati (novel).pdf/248

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

247

వచ్చి కన్యాప్రదానమునకు సిద్ధముగఁ గూర్చుండెను. భజంత్రీలు మేళముసేయ నారంభించిరి. మహాదేవశాస్త్రి పుల్లయ్య చేసిన తంత్రము సఫలము చేయుటకై మంత్రములు చదువ నారంభించెను. అంతలో బుచ్చమ్మ బాజాల చప్పుడువలన మేలుకొని "మా అమ్మేది ! నన్ను మా అమ్మదగ్గరికి తీసికొనివెళ్ళు!" అని పెద్దపెట్టున నేడ్వ నారంభించెను. పుల్లయ్య మిఠాయి పొట్లమిచ్చెను. అఱఁటిపం డిచ్చెను. బెల్లపుముక్క జూపెను; కాని యవి యామె యేడ్పును నివారింపలేకపోయను. బ్రతిమాలెను; బెదరించెను; ప్రాణము విసిగి రెండు చెంపకాయలు కొట్టెను. ఎన్ని చేసినను బుచ్చమ్మ యేడ్పు మానలేదు. విఘ్నేశ్వర పూజ నిమిత్తము పళ్ళెములో బోసిన బియ్యము బుచ్చమ్మ క్రిందఁ బడి దొర్లి యేడ్చునప్పుడు కాళ్ళతో దన్ని పారబోసెను. ఈ యేడ్పు వల్ల జూడవచ్చిన వారు పిల్లను దొంగతనముగా దీసికొని వచ్చి నట్లు దెలిసికొని వివాహము చెడగొట్టెదరేమో యని గణపతి గుండెలు పీచు పీచు మనెను. తన కేదైన చిక్కు వచ్చునేమో యని పుల్లయ్య భయపడెను. కుశాగ్రబుద్ధియైన మహాదేవశాస్త్రి సమయోచితముగా నాలోచించి దేవాలయం యొక్క వీధి తల్పులు గట్టిగా మూసివేయించి పిల్లదాని యేడు పెవ్వరికి వినబడకుండ గట్టిగా మేళము చేయు మని భజంత్రీలతోఁ జెప్పెను. వారు గట్టిగా వాయించి యొకరిమా టొకరికి వినబడకుండఁ జేసిరి. పిల్లయేడ్పుగాని మహాదేవశాస్త్రి మంత్ర