పుట:Ganapati (novel).pdf/245

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

244

గ ణ ప తి

మీ యమ్మదగ్గరకుఁ తీసికొని వెళ్ళనా ! రా !" యని చల్లగాఁ మాటలు చెప్పుచుఁ దా నదివఱకుఁ గుదిర్చి యుంచిన బండిమీఁద నెక్కించి బండి కీ ప్రక్క నాప్రక్క రెండు గుడ్డలు కట్టి మిక్కిలి వేగముగ బండి తోలుమని బండివానితోఁ జెప్పి "బుచ్చమ్మ ! నీకు లక్కపిడతలు కొని యివ్వనా? మంచి పరికిణీ గుడ్డ లున్నవి. నీవు కుట్టించుకొని కట్టుకొంటావా?" యని యిచ్చకము లాడుచు, ఖర్జూరపుపండు తినిన వెంటనే మిఠాయి పొట్లము చేతి కిచ్చి యేదో విధముగా నేడువకుండ రాత్రి నాలుగు గడియ లగునప్పటికి వానపల్లి తీసికొనిపోయి మహాదేవశాస్త్రి గారి యింటిదగ్గర బండి దిగెను. పూజారి గుడిలో సిద్ధముగా నుండెను. మహాదేవశాస్త్రిగారి యొక్క యేర్పాటుచేత రెండు కాగడాలు సిద్ధముగా నుండెను. భజంత్రీలు వచ్చి కూర్చుండిరి. మహాదేవశాస్త్రి యానాటి యుదయముననే గణపతిని దన యింటనే పెండ్లి కుమారుని చేసెను.

బుచ్చమ్మ బండిలోన నిద్దుర పోయినందున నామెను భుజముమీఁదఁ బండుకొనఁ బెట్టుకొని పుల్లయ్య మహాదేవశాస్త్రి యింటికిపోయి యతనిం బిలిచెను. గణపతియు మహాదేవశాస్త్రియు నత్యంత సంతోషముతో నాతని నెదుర్కొని నిర్విఘ్నముగా బాలికం దోడి తెచ్చినందుకు వానిని గడుంగడు బ్రశంసించిరి. అప్పుడు పుల్లయ్య మహాదేవశాస్త్రిం జూచి "ఏమోయి ! కన్యా ప్రదాన మెవరు చేయుదురు? ఆ మాట నీతోఁ చెప్ప మఱచితిని.