పుట:Ganapati (novel).pdf/241

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

240

గ ణ ప తి

ముగా నీవే నా మేనమామవు. నాగన్నగాడు నా మేనమామగాదు. నీ కున్న యభిమానము మఱెవరికి లేదు. ఈ దెబ్బతో నాగన్నగాడి రోగము కుదిరిపోవును. బ్రహ్మాస్త్రమువంటి యుపాయమిది. ఇక నేను వెళ్ళెదను. నీవు వానపల్లి వెళ్ళి వచ్చిన తరువాత మనము తిరిగి కలుసు కొందము." అని వెళ్ళెను. పుల్లయ్య వీధి వరకు వానిని సాగనంపి చిరకాలము నుండి నాగన్న మీఁద తనకుఁ గల క్రోధమును దీర్చికొనుటకుఁ దగిన యవకాశము లభించినదని మనంబున మిగుల సంతసించెను. నాగన్న మీఁది కోపము చేతనే పాతిక ముప్పది రూపాయలు కూడ నతఁడు ఖర్చుపెట్ట దలఁచెను. క్రోధమే పని జేయింపదు? పుల్లయ్య మరునాడు తెల్లవారుజాముననే లేచి వానపల్లి వెళ్ళి యచ్చట నున్న విష్ణు దేవాలయము యొక్క పూజారిని కలుసుకొని రెండు రూపాయలు వాని చేతిలోఁ బెట్టి రహస్య వివాహము జరుగునని యతనితోఁ జెప్పి సాయము చేయవలెనని కోరి పిల్ల తండ్రి పేరు మొదలైనవి చెప్పక తనకుఁ చిరకాల మిత్రుఁడైన ద్రావిడ బ్రాహ్మణుని మంథా మహాదేవశాస్త్రిని గలిసికొని తన సంకల్పమాయనతోఁ జెప్పి యాయన సమ్మతిం బడసి పురోహితుడుగా నుండవలె నని యతనినే గోరి రెండు రూపాయలు ముందాయనకిచ్చి మాఘశుద్ధ షష్టినాడు ముహూర్తము పెట్టించి బాజా భజంత్రీలను గుదుర్చుమని యతనితో చెప్పి తిరిగి వచ్చునప్పుడిట్లనియె "మహాదేవుడు బావ ! పిల్లను షష్టినాడు వీలైతే