పుట:Ganapati (novel).pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

23

నివసించిరి. అంతకుముందు వారి పూర్వుల నివాసస్థానము నక్కపల్లి. ఈ గ్రామము తూర్పునాడున నున్నది. నక్కపల్లినుండి గణపతి పూర్వులు మందపల్లికి వచ్చుటకు గొప్ప కారణము గలదు. గణపతి కెనిమిదవ పూర్వపురుషుఁడు నక్కపల్లిలోఁ గాపురము చేయుచుండ యొకానొక దినమున భార్యమీఁద మిక్కిలి కోపగించిన వాడై కోపమాపుకొనలేక జందెములు త్రెంపివేసి చెరువు గట్టుననున్న రావిచెట్టు కడకుఁ బోయి ముండనము జేయించుకొని సన్యసించెను. సన్యాస మిప్పించుట కెవరైన గురువు కావలయునని శాస్త్రములో నున్నది గదా! కోపమే పరమగురువై యీతనికి సన్యాస మిప్పించుటచేత నీతని సన్యాస మశాస్త్రీయమని వైరాగ్య భావముచేత సంప్రాప్తమైనది కాదని గ్రామ మందలి బ్రాహ్మణులా యపూర్వ స్వాములవారిని వెలివేసి భిక్షలు చేయుట మానిరి. ఒకరు భిక్షలు చేసెడిదేమి? నాయిల్లే మఠము. నాభార్యయే నాకు శిష్యురాలు. నా బిడ్డలేముఖ్యశిష్యులని యా ధూర్తస్వామి కడుపుమంట కాగలేక మూఁడవనాఁడె స్వగృహంబున కరిగి భార్యను బ్రతిమాలి యొడంబఱచి సన్యాసమునకు సన్యాసమిప్పించి కోమటి పేరి శెట్టి దగ్గర జందెములు వెలకుఁగొని మెడలోవేసికొని రెండు మాసములలోఁ బిల్లజుట్టుఁ బెంచికొని మరల గృహస్థుఁడయ్యెను. ఊరివా రందఱుఁ గట్టుగట్టి ఆ కుటుంబమున కంతకు