పుట:Ganapati (novel).pdf/235

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

234

గ ణ ప తి

మాతాపుత్రులలో నెవరు భిక్షాటనము చేసినను నుపదేశము చేసిన యవ్వకు సమానమె గనుక యామె యా సలహా నంగీకరించి బిచ్చమున కామెం బురికొలిపెను. మరునా డుదయమునుండి యామె యాయవార మారంభించెను. ప్రతిదిన ముదయము గణపతికి గడుపునిండ జద్దియన్నము బెట్టి యామె గ్రామ సంచారము కరిగి రెండుజాములైన తరువాత వచ్చి స్నానము చేసి మడికట్టుకొని వంటచేసి కొడుకునకు బెట్టి తాను దినుచుండెను. గణపతి చద్దికూడు తిని తల్లి తెచ్చిన బియ్య మప్పుడప్పు డమ్మి పొగచుట్టలు కొనుచు, డబ్బు లేనప్పుడు బియ్యమే యిచ్చి యీతపండ్లు, జీడిమామిడిపండ్లు, వెలగకాయలు, రాచయుసిరికాయలు, చెఱుకుకఱ్ఱ ముక్కలు, నేరేడు పండ్లు మొదలగు చిరుతిండివస్తువులు వీధిలోని కమ్మవచ్చినప్పుడు దీసుకొనుచు, నున్నగా గిరజాలు దువ్వుకొని చుట్టలు కాల్చుచు, గ్రామము వెంటఁ దిరిగి తిరిగి రెండుజాము లగునప్పుడు టక్కు టక్కు మని ముచ్చెలు చప్పుడగునట్లు గృహమునకు వచ్చి "వంటైనదా లేదా!" యని గొప్ప యధికారి వంటకత్తె నడిగిన ట్లడిగి, యైన దన్నప్పుడు ముందు తనకే పెట్టుమని తిని 'కాలేదు, నాయనా ! ' యని యన్నప్పుడు 'దౌర్భాగ్యపుముండా ! పెంటముండ ! వంట పెందలకడ చేయక గుడ్డిగుఱ్ఱమునకు పండ్లుతోముచున్నావా? నీకు నాలుగు చెంపకాయలు తగులవలె, లేకపోతే బుద్ధిరా ' దని యొకప్పుడు మాటలతో పోనిచ్చుచు, మరి యొకప్పుడు