పుట:Ganapati (novel).pdf/227

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
226

గ ణ ప తి

దలంచుకొన్నానని గ్రామములో చెప్పుకొనుచున్నారు. ఇది నిజమేనా!"

"ఆహా! నిజమే. నేను మన బుచ్చిని రాయప్ప కిచ్చి పెండ్లి చేయఁదలచుకొన్నాను. ఈ వేళో రేపో నేనే ముందుగా నీతో చెప్పదలఁచుకొన్నాను. నీవే అడిగినావు కనుక చెప్పుచున్నాను. ఆ మాట నిజమే. ప్రధానము చేసికొని వచ్చినాను. ముహూర్త నిశ్చయముగూడ అయింది. పెండ్లి నెల్లాళ్ళున్నది. మాఘ శుద్ధ దశమినాఁడు సుమూహుర్తము."

ఆ మాట చెవినిఁ బడగానె యామె మహాపద వచ్చిన తెరంగున గుండె బాదుకొని మొత్తుకొని "అయ్యో ! అయ్యో ! నాయనా ! యెంత పని చేసినావురో, నా కొంప తీసినావురా, అన్నయ్యా ! నన్ను చంపివేసినావురా, అన్నయ్యా ! నా వంశము నాశనము చేసినావురా, అన్నయ్యా ! నా కొడుకును ఘోటకపు బ్రహ్మచారిని చేసినావురా, అన్నయ్యా!" అని యంతటితో నిలువక "ఓ అమ్మా ! ఓ నాయనా!" యనుచు మృతినొందిన తల్లిం దలంచుకొని కొంతసేపు తండ్రిం దలంచుకొని కొంతసేపు మగనిం దలంచుకొని కొంతసేపు పెద్దపెట్టున రోదనము చేసెను. ఏమో కీడు మూడిన దని చుట్టు ప్రక్కలవారందరుఁ జేరిరి. ఆ యమ్మలక్కల మొగములు గనఁబడగానే యామె దుఃఖము మరింత యధికమగుచు నామె దుఃఖపరవశయై "ఓ పుల్లమ్మత్తా! ఓ నరసమ్మ పిన్నీ ! ఓసీతమ్మ వదినే ! ఓ మాచమ్మక్కయ్యా ! విన్నారటె మీరు ! మాఅన్నయ్య మాబుచ్చిని నా గణపతి