పుట:Ganapati (novel).pdf/223

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

222

గ ణ ప తి

ననుసరే వాడొప్పుకొనును. ఈ సంగతి మీరు గట్టిగా ఆలోచించుకొని మాకేదో సమాధానము చెప్పండి. తరువాత మా నాన్నకు వర్తమాన మంపించెదను."

భార్య చెప్పిన యుపాయము నాగన్నకు నచ్చెను. రాయప్పకుఁ గాని మఱియొకరికిఁ గాని నాలుగువందలు పుచ్చుకొని, పిల్లకు వివాహము చేసినపక్షమునఁ దనకు ఋణవిమోచన మగునని యొక దారి యతని మనస్సునకుఁ బొడకట్టెను. గాని పుత్రికా వివాహము తలఁపునకు రాఁగానె తోఁబుట్టువు మాట యతనికి జ్ఞప్తికిరాగా సతీపతుల కీ క్రింది సంభాషణము జరిగెను.

"మా గణపతికి పిల్ల నీయకపోయినపక్షమున నా చెల్లెలు దుఃఖపడు నని మనసులో సందేహము కలుగుచున్నది."

"గణపతికి పిల్ల నిచ్చుటకంటె పెద్దగోదావరిలో దింపుట మంచిది. అతనిదగ్గర ఒక గుణమైన నాడెమైనది లేదు. పిల్లవాడు మరుగుజ్జు, బుద్ధులు పాడుబుద్ధులు; ఇల్లు లేదు. వాకిలి లేదు. భూములు లేవు, పుట్ర లేదు. తినబోతే అన్నము లేదు. కట్టబోతే గుడ్డ లేదు. ఏమి చూచికొని పిల్ల నివ్వను!"

"ఇల్లు వాకిలి భూమి పుట్ర విద్యాబుద్ధులు వుంటే పిల్లనెవరైన యివ్వగలరు. లేనివాడు కనుకనే మన మియ్యవలసి వచ్చినది."

"మేనల్లు డని జాలిదలఁచి గొంతుక కోయఁదలతురా! పెండ్లాము బిడ్డలకు అన్నము పెట్టుటకైన శక్తి యుండవలెనా లేదా? దానిమా టటుండనీయండి! ఇప్పుడు