పుట:Ganapati (novel).pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

219

వాడు నిన్ను చంపివేయవలెనని యున్నాఁడు. నే నేమి చేతురా తండ్రీ!" అనవుడు గణపతి తల్లి కిట్లనియె.

"అమ్మా! విచారించకు, నావల్ల లోపము లేదు. మామయ్య పెండ్లాము చెప్పిన మాటలు పథ్యముగా గ్రహించి నా మీఁద గంతులు వేయుచున్నాఁడు. ఆడుదాని మాటలు విని నన్ను చావఁగొట్టుటకు సిద్ధమవుచున్నాఁడు. అతని యింటిలో మన ముండవద్దు. ముష్టి యెత్తియైన నిన్ను నేను పోషింపఁగలను. పోదాములే! 'పెండ్లాము బెల్లము తల్లి దయ్య ' మన్నట్టి సామెత నిజమయినది. ఇత నెంత, యితని యన్నమెంత? ఇతని యిల్లెంత? నూరుతిట్లు తిట్టి పట్టెడన్నము పెట్టినంత మాత్రమున లాభ మేమిటి? నాకా అన్నము వంటబట్టుటలేదు. రేపుదయము వెళ్ళిపోదములే! "అనవుడు నామె " నాయనా! తొందరపడకుఁ మామయ్యతో మన కెన్నో పనులున్నవి. అతనిదగ్గర పిల్ల వున్నది. పెండ్లాము కిష్టము లేకపోయినప్పటికి అతని నేలాగో వంచి పిల్లను మనము చేసుకొనవలెను. కోపపడకు! తమాయించుకో ! నిదానించు! తొందరపడకు. కార్యము సాధించుకోవలెను గాని చెడదీసుకోగూడదు" అని మందలించెను.

సరే యని గణపతి యెప్పుకొని తల్లినిఁ బంపి తానొకటి రెండు దినము లక్కడక్కడ భోజనముఁజేసి తరువాత మేనమామ లేనప్పుడు చాటుగా బోయి తినుచుఁ బిమ్మట మెల్లమెల్లఁగ మేనమామ కంటఁబడుచు నెప్పటియట్లు వుండెను.