పుట:Ganapati (novel).pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

21

గ్రహించుటం జేసి నాటనుండియు వాని యింటిపేరు పప్పుభొట్లవా రని ప్రసిద్ధికెక్కెను. గోదావరీ తీరమున మందపల్లి యను నొక గ్రామము కలదు. ఇక్కడ శనైశ్చరుఁడు శివప్రతిష్టఁ జేసెను. శనికి మందుఁడను నామాంతరము గలదు. కావున శని ప్రతిష్టితుఁడై యీశ్వరుఁ డచ్చోట మందేశ్వరుఁడని వ్యవహరింపఁబడుచుండును. ఈ మందేశ్వరస్వామివలన నీ గ్రామము గోదావరీమండలముననే గాక కృష్ణా విశాఖపుర మండలములయందుఁ గూడ మిగులు ప్రసిద్ధికెక్కెను. శనిపీడ గలవారీగ్రామమునకుఁ బోయి బ్రాహ్మణులకు వలసిన తిల దానములిచ్చి తైలాభిషేకము మందేశ్వరునకుఁ జేసిన పక్షమున శనిదోషంబు శమియించు నని స్థలపురాణజ్ఞులు చెప్పుదురు. ఆస్తికబుద్ధిగల మనవా రందఱు శనిగ్రహావిష్ణులైనప్పుడచ్చటకుఁ బోయి కొంత ధనము వ్యయముజేసి శనివిముక్తులగుచుందురు. అనేక మహర్షులు దేవతలు బ్రహ్మస్థలముల యందు మహేశ్వరప్రతిష్టలు చేసిరి. కాని శనైశ్చరుడు ప్రతిష్టఁజేయుట తరచుగ వినము. సేతువుదగ్గర రఘురాముని చేతఁ, బ్రతిష్టింపఁబడిన మహేశ్వరుఁడు, రాజమహేంద్రవరమున మార్కండేయుని చేతఁ బ్రతిష్టింపబడిన మహేశ్వరుడు, మఱియు నగస్త్యాది మహర్షులచేతఁ బ్రతిష్టింపబడిన మహేశ్వరుడు శనైశ్చరుని చేత నేల బ్రతిష్టింపఁబడె నని నాకు వలెనే మీకును సంశయము దోపకపోదు. మృత్యుంజయుడైన సదాశివునకు గూడ శనిగానివలన భయము జనించి