పుట:Ganapati (novel).pdf/219

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

218

గ ణ ప తి

ఓపికపట్టి బాధలు పడినాఁడు. నా బోటిదానినైతే కొంపంటించి లేచిపోదును. నీ బిడ్డను మాత్రము నీ వేమి తిట్టకు కొట్టకు" మని చెప్పి వెళ్ళెను.

తాను పడిన యభిప్రాయమే సరియైనదనియు, దన కుమారుఁడు నిర్దోషి యనియు నామె మరియు దృఢముగా నమ్మెను. మేనమామ గణపతిమీఁద మహాగ్రహము కలిగి యిల్లెగిరిపోవునట్లు కేకలు వేయజొచ్చెను. ఈ వృత్తాంతము తన మిత్రునివలన విని గణపతి యా పూట యింటికి రాక మున్ను దనపక్షము బూనిన ముసలమ్మ యింటిలోఁ గూర్చుండి మేనమామయొక్క నరసింహావతార చేష్ట లన్నియుఁ గనిపెట్టు చుండెను. అతఁ డిక్కడున్న వార్త యా ముసలమ్మ తల్లి కెరుకజేయఁగా నామెవచ్చి కొడుకుం గౌఁగిలించుకొని గట్టిగా నేడ్చినపక్షమునఁ దన సోదరునికి వినబడు నని శంకించి మెల్లగా నేడ్చెను. తల్లినిఁ గౌగిలించుకొని కుమరుఁడుగూడ నేడ్చెను. అన్యోన్యాలింగన పురస్సరముగా మాతాపుత్రులు కొంతసేపు రోదనము చేసిన తరువాతఁ దల్లి కుమారున కిట్లనియె.

"నాయనా! నీకెంత కష్టము వచ్చినదిరా! అన్నములేక నీ వెంత మల మల మాడిపోయినావో నీ కెంతయాఁకలైనదో, అలాటప్పుడు నన్నుఁ దలంచుకొని నీ వెంత యేడ్చినావో! ఆ వగలాడి కొంచెమైన జాలిలేక పెనిమిటితో నీ వడ్డమైనమాట లన్నావని చెప్పింది. దాని వలలోఁ బడిపోయి