పుట:Ganapati (novel).pdf/213

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

212

గ ణ ప తి

యికి మేనత్తవా, తల్లివా, పెత్తల్లివా ? యెవతెవని పిలిచినావు? చాలు చాలు నోరు మూసుకో!" యని కఠినముగాఁ బలికెను. మాటఁమీద మాట వచ్చెను. మాటలు తిట్లుగా మారెను. బారలు చాపుకొని వారిద్ద రొండొరులను దూషించుకొనుచు, తలిదండ్రులను చుట్టాలను బ్రతికియున్నవారికి చచ్చినవారిని నన్యోన్య మాతృవంశమున నేడు తరముల వారిని నిందించి, దెప్పుకొని గొంతులు పోవునట్లఱచి పోరాడి, కలహ మాడుట కోపిక లేక లోపలికిఁ పోయిరి. గణపతి తన పక్షము వహించిన ముసలమ్మను వెనుక వైచికొని మేనత్తను నాలుగు మాటలని యెట్టకేల కారాత్రి ముసలమ్మ గృహమందే భుజించి పండుకొనెను. గణపతి మరునాడు కూడ ముసలమ్మ యింటనే భోజనము చేయదలచెను. గాని గణపతి భోజన వైఖరి రాత్రి చూచిన తరువాత ముసలమ్మ గుండె బాదుకొని యట మీఁద వానె నెట్లయిన వదలించుకొనవలెనని తలంచి యుదయముననే గణపతిం జేరఁ బిలిచి " నాయనా ! ఈ పూట వెళ్ళు ! నా బియ్యము పోయ వలసినదని చెప్పు. పోయనంటే మా యింటి యొద్ద తినవచ్చును. ఎందుకు పెట్టదో చూడవలె దీని బాబుగారి ముల్లె తెచ్చిపెట్టు చున్నదా యేమి? నీ మేనమామ సొమ్మేకదా నీకు పెట్టుచున్నది. వెళ్ళి చెప్పిరా, యేమనునో చూత" మని మెల్లఁగా నుపదేశించెను. సరేయని చివాలున లేచి గణపతి యింటికిఁ బోయి "ఇదిగో నమ్మా ! ఈపూట మన యింటికే