పుట:Ganapati (novel).pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

199

బ్రదుకవలసిన కుంకవు! నాలుగు కొల్లాయి గుడ్డలు కట్టుకొని కాలక్షేపము చేయవలసిన చచ్చుపీనుఁగవు! నీకు కోటులు నీటులు కావలెనా ! పోకిరీవేషములు వేయఁదలఁచి, భోక్తగాఁ గూర్చుండి యర్చించిన తరువాత గొంతెమ్మ కోరికలు గోరి శ్రాద్ధము భంగము చేయుదువా? ముందెన్నఁడయిన నిటువంటి పనులు చేయవు గదా?" యని యా జువ్వతో వీపుమీఁద రెండు దెబ్బలు కొట్టెను. పాపము, గణపతి 'స్థానబలిమి గాని తన బలిమి గాదయా విశ్వదాభిరామ వినురవేమ' యనినట్లు పూర్వకు బింకమంతయు వదలి "బాబోయి! బాబోయి! ఇకముం దెన్నఁడు చేయనండి ! రక్షించండి ! బుద్ధితక్కు వొచ్చింది, నా వల్ల !" యని యేడ్చుచు వేడుకొనెను. బ్రాహ్మణుని - అందులోఁ దన యింటికి శ్రాద్ధ భోక్తగా వచ్చియున్నవాని - నంతకంటె నెక్కువగా శిక్షింపఁగూడదని యా రెండు దెబ్బలతోనె శిక్ష చాలించి, కట్టు విప్పించి యిట్లనియె. "జాగ్రత్త ! బుద్ధిగల్గి బ్రతుకు. మన దేశములో బ్రాహ్మణులంటే మిక్కిలి భక్తి గనుక బ్రాహ్మణుఁడేమిచేసినను జెల్లు ననుకొంటివి కాబోలు. భోజనము దగ్గఱ నీ వాగడము చేయుటయే గాక మీరు చావరా, మీ బందుగులు చావరా యని మొదలు పెట్టితివి. ఈ లాగున మఱియొకసారి ప్రేలితివా త్రవ్వి పాతిపెట్టించెదను. చర్మము నొలిపించెదను. నీ ఋణము నే నుంచుకొన దలఁపలేదు. ఒక్కొక్క భోక్తకు రెండేసి సైనుగుడ్డలు మేమీయఁ దలఁచుకొన్నాము. నీకు