పుట:Ganapati (novel).pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

194

గ ణ ప తి

దోఁచెను. కుక్క యచ్చటికి రాకపోయినను గణపతియె తత్కాలమున శునకరూపమెత్త మూఁకుడు జరజర లాగి "ఛీఛీఛీ! లేలే కఱ్ఱదే!" యని కేకలు వైచెను. ముసలమ్మ బిందె యెత్తుకుని వచ్చు చుండఁగా నీ మాట లామె చెవిని బడెను. పడుటయు విసవిస నడిచి "నాయనా! కుక్క వచ్చినదా యేమిటి? దానితల బ్రద్దలైపోను. ఆ నల్లకుక్క నా నెత్తురు పీల్చివైచుచున్నది. కొంపత్రవ్వి రొట్టె ముట్టుకోలేదుగదా" యని బిందె దింపెను. అనవుడు గణపతి యిట్లనియె. "అయ్యో! అవ్వా! నేను పరధ్యానముగా నటువైపు తిరిగి కూర్చుండఁగా మూఁకుడు జరజరలాగినట్లు చప్పుడైనది. ఇట్టె తిరిగిచూడఁగా నల్లకుక్క లాగున్నది. వెంటనే దానిని కొట్టితిని. ఈ దారినే పాఱిపోయినది. పెద్ద గుఱ్ఱములా గున్నది. పాపము సిద్ధముగా నున్న రొట్టె పోయినది. నూతికి వెళ్ళినప్పుడు కుక్క బాధ యున్నది. జాగ్రత్తగాఁ జూచు చుండు మని చెప్పినావు కావు. పాపము! నీ వీరాత్రి యూరక పండుకోవలెను గాఁబోలు! కొంచె మటుకులైన నానవైచికొని తిను." అనుచుండ నా ముసలమ్మ ఇట్లనియె. "నాయనా ! అటుకులున్నవి. చిటికలో నానవైచికొని తినగలను. కాని రొట్టె పోయినందు కే విచారము లేదు. ఇప్పుడీ కుక్క యెంగిలి ముట్టుకొని స్నానము చేయలేను. పెద్దదానను, కొంచెము జబ్బుగా నున్నది. ఎలాగా యని యాలోచించు చున్నాను." అనవుడు గణపతి చివాలున లేచి "అవ్వా! నేను