పుట:Ganapati (novel).pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

193

మాగజాలక పోయెను. అందుచే నతఁ డుదరశాంతికై ప్రయత్నములు చేయఁజొచ్చెను. ఒక నిముస మాలోచించి నప్పటి కుపాయము దోఁచెను. ఆ గ్రామమున నతని తల్లికి దూరపు జుట్టమైన యొక ముసలమ్మ యుండవలెనని యతనికి జ్ఞప్తి వచ్చెను. రాఁగానె తన మిత్రబృందమును విడిచి యా యవ్వ బస యెక్కడని గ్రామమున భోగట్టచేసి తెలిసికొని, యామె యింటికిఁ బోయి పలుకరించి తన్నెఱిఁగించుకొనెను. ఆ యవ్వయు నతనిని గౌరవించి వచ్చిన పని యడిగి, యతఁడు భోక్తగా వచ్చిన వాఁడని యతని నోటనే విని, బ్రాహ్మణార్థపు మైల సోకినందున దూరముగాఁ గూర్చుండు మని నాలుగు మాటలాడి 'నాయనా! పొయ్యిమీఁద రొట్టె వైచినాను. మాడిపోవుచున్న దేమో' యని లోపలికి బోయెను. గణపతి పడమటింటి గుమ్మము ముందరే గూర్చుండెను. రొట్టె కాలిన తరువాత ముసలమ్మ పడమటి యింట హద్దు గోడవద్ద రొట్టెతో నున్న బూరెల మూఁకుడు పెట్టి, బిందెడు నీళ్ళు తోడి తెచ్చుకొనుటకు దొడ్డిలోని నూతి కడకుఁ బోయెను. ఆ బూరెలమూకుఁడు చూచినది మొదలు కొని గణపతి కన్ను లా రొట్టెమీఁదనే యుండెను. నూరూరఁ జొచ్చెను. ఎంత కాలమునుండియో తినుట కేమియు లేక మలమల మాడుచున్న వానివలె నతఁడెట్లయిన దానిని గ్రహించి తిని ప్రాణము నిలుపుకొన సంకల్పించెను. పొట్ట యుపాయముల పుట్ట యగుటచే నాలశ్యము లేకయే యతని కుపాయము