పుట:Ganapati (novel).pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

181

యిప్పుడు పడుకో; రేపటి దినము మాటాడ వచ్చును" అని గణపతి పండుకొనెను. తల్లి నిద్రాభారముచేత గన్నులు తెరువలేక ప్రక్కవైచికొనలేక వట్టి నేలనే పండుకొనెను. గణపతి నిద్రించి, బిందె తీసికొనిపోయి యమ్మినట్లు, రెండుకోట్లు కుట్టించుకున్నట్లు, తిన్నగా నుదుకనందుకుఁ జాకలి దానితోఁ గలహమాఁడినట్లు స్వప్నములు గాంచెను. మరునాఁ డుదయమున లేచి గణపతి బిందె యిమ్మని తల్లిని మిక్కిలి పీడించెను. అమాయకురాలైన యా యిల్లాలు కొడుకు మాట లన్నియు వట్టి కోతలని తెలిసికొనలేక యవి సత్యములే యని నమ్మి బిందె దాకట్టు పెట్టియో, విక్రయించియో, రెండురూపాయలు తెచ్చి యిచ్చిన పక్షమున తన కుమారుఁడు మిక్కిలి గొప్పవాఁడై విశేషమగు ధన మార్జించి తన నుద్దరించునని తలంచెను. అందుచేత బిందె కుదువ బెట్టవలెనని యామెకూడా సంకల్పించెను. కాని సోదరుఁడు, సోదరుని భార్యయు జూచుచుండగా నట్టిపని చేయుట కిష్టము లేదు. వారా పని సాగనియ్య రని యామె యెరుగును. అందుచేత నామె మరునాడు రాత్రి సోదరుఁడు నిద్రించిన తరువాఁత గడచిన రాత్రివలెనే కుమారుని ప్రక్కలోఁ గూర్చుండి యిట్లనియె. "నాయనా! బిందె తాకట్టుపెట్టుట నా కిష్టమెకాని నీ మేనత్తయు నీ మేనమామయుఁ జూచుచుండ నట్టి పని చేయుటకు నాకిష్టము లేదు. అందులో ముఖ్యముగ నీ మేనత్త నిన్ను జూచి నప్పుడెల్లఁ