పుట:Ganapati (novel).pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

16

గ ణ ప తి

లభించినదో చెప్పెద వినుండు. ఒకనాఁడు నేనొక మిత్రునింటికి విందారగింపఁ బోతిని. ఆ మిత్రులయింట వివాహము జరుగుచుండెను. ఆ విందు నిమిత్తము మిత్రులనేకులు వచ్చియుండిరి. ఇప్పటివలె చీట్లు పంపి భోజనమునకు పిలిచెడు నాచార మప్పుడు లేదు. పెందలకడ భోజనము పెట్టు నాచారమంతకంటె లేదు. విస్తళ్ళు వేయునప్పటికి రెండుజాముల రాత్రి యయ్యెను. వడ్డించు నప్పటికి మఱినాలుగు గడియలు ప్రొద్దుపోయెను. భోజనము చేసి లేచునప్పటికి కొక్కురో కో యని కోఁడికూసెను. విస్తళ్లు వేయకమునుపు, విస్తళ్లముందుకి గూర్చుండిన తరువాతను, భోజనము సేయుచు నెడనెడ వంటకములు వచ్చులోపలను నేను నాలుగు కునుకులు కునికితిని. ఆ నిద్రలో నాకొక స్వప్నము వచ్చెను. ఆ స్వప్నములో విలక్షణమైన యొక విగ్రహము కనబడెను. కర్కోటకుఁడు కఱచిన తరువాత మారురూపము దాల్చిన నలుడా? యితఁడని యా విగ్రహమును జూచి నేను వితర్కించుకొంటిని. వామనరూపుఁడా యని మఱికొంతసే పనుకొంటిని. అప్పటికి నాకు దోచిన కొన్ని కారణములచేత నే ననుకొన్న రెండు రూపములు కావని నిశ్చయించుకొనియుంటి నని భావించి భయపడితిని. ఆ పురుషుడు నా భయము జూచి నవ్వి "భయపడకు, నేను నీకు హాని సేయుదలఁచి రాలే" దని మీఁద చేయివైచి తట్టి వెండియు నిట్లనియె. "అయ్యా! నేను గణపతిని; కాని పార్వతీపరమేశ్వరుల కుమారుఁడైన వినాయ