పుట:Ganapati (novel).pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

162

గ ణ ప తి

రమ్మని పిలిచెను. మిత్రుని యభీష్టసిద్ధి చేయఁదలఁచి మిత్ర విధేయుఁడైన గణపతి వారితో గలిసి వెళ్ళెను. రాజమహేంద్రవరములో నున్న కాలమున గణపతి క్రొత్త ప్రపంచమున నున్నట్లుండెను. ఆ పురవీధులలో నడచునట్టి తన యీఁడు బాలకుల కందరకు గిరజాలుండుట యతఁడు చూచి యా బాలకులవలె తాను గూడ గిరజాలు నున్నగాదువ్వి చెవుల సందుననుండి వెనుకకు దువ్వి మడిచి యుంగరములుగఁ జుట్టి తిరగవలెనని యతని కుబలాటము గలిగెను. పిల్లజుట్టుపై నతని కెంతో యసహ్యము కలిగెను. గిరజా లుంచుకొనని వాని బ్రతుఁకెందు కనిపించెను. ఎన్ని జన్మలయందు మంచి తపము చేసిన యదృష్టవంతులకో గాని గిరజా లుంచుకొనునట్టి భాగ్యము కలుగదని యతఁ డనుకొనియెను. అనుకొన్న విషయ మాచరణములో బెట్టుటలో నతఁ డగ్రగణ్యుడని పూర్వచరిత్రము వలన మీరు తెలిసికొని యుండవచ్చును. ఒకనాఁటి రాత్రి యీరీతి ననుకొనెను. మరునాఁ డుదయమున బెందలకడ లేచి భజంత్రీ మేళములోనున్న యొక మంగలిని బిలిచి తన పిల్లజుట్టు గొరిగివైచి గిరజాలు పెట్టుమని కోరెను. వెంటనే మంగలివా@ డతనికోరిక ప్రకారము చేసెను. ఆ మహాకార్యము చేసినందుకు మంగలివాని కొక యణా యిచ్చి తదృణము దీర్చికొని కృతకృత్యుఁ డయ్యెను. అట్టి నూతన వేషముతోనున్న గణపతిని జూచి పెండ్లివారిలో సంతసింపని వారు లేరు. ఏదో ఘనకార్యము చేసినవాడువోలె నన్యులకు