పుట:Ganapati (novel).pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

157

మూసికొని రెండవచింత విడిచి యొక్క జామాలోచించి యెట్టకేల కొకయుపాయము పన్నెను. డబ్బు కావలసి వచ్చినపుడతఁడు చుట్టుప్రక్కలనున్న చిన్నచిన్న గ్రామములు కరిగి గ్రామమందలి బ్రముఖుల నందఱ జూచి మాతండ్రి చనిపోయినాఁడు. పేదసంసారము. దినవారములు జరిగించుకొనుటకు డబ్బులేదు. మీరందఱు సాయముచేసి యీ బ్రాహ్మణ కర్మ యేలాగైన గడతేర్చి నన్నొకదరికి జేర్చవలయు. శ్రాద్ధకర్మ చేయకపోయిన యెడల బందుగులు వెలిపెట్టుదురు. చనిపోయిన వానికి మంచి గతులు గలగవు. తండ్రి పోయినందుకే నే నేడ్చుచుండగా మీదు మిక్కిలి శ్రాద్ధము పెట్టుటకయిన డబ్బు లేకపోయినదని నేనిట్లు బిచ్చమెత్తవలసి వచ్చినది. తండ్రి దినవారములకూడ డబ్బు లేనంత దురవస్థ నాకు భగవంతుడు తెచ్చిపెట్టినాఁ " డని కన్నుల నీరు పెట్టుకొని రానిదు:ఖము దెచ్చిపెట్టుకొని యేడ్చును. పదునాలుగు సంవత్సరముల పిల్లవాఁడు పితృరుణ విముక్తడు కాఁదలఁచి యాచించుటయె జాలి గలిగించును. అట్టియెడ నబ్బాలుని కన్నుల బాష్పోద్గమ మయ్యెనా యట్టియెడ నెవని మనసు కరుగదు. ఎవనికపుడు చుమ్మలు చుట్టదు. ఆ యా గ్రామములలోని జనులతని బూటకములు నమ్మి యెవరికిఁ దోచినమట్టుకు వారు సహాయము చేయుచుందురు. ఒక్కొక్కనాఁ డతనికి రెండు మూఁడు రూపాయలు గూడ దొరుకుచు వచ్చినవి. సాధ్యమైనంత వరకతఁడు వెళ్ళినయూరు వెళ్ళకుండ నీవ్యాపారము సాగించు