పుట:Ganapati (novel).pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

156

గ ణ ప తి

మింటికి తిరిగివచ్చు నావులను, గేదెలను వీధులవెంట దిరుగు మేకలను బట్టుకొని యొకప్పుడు బందమువైచియు మఱొకప్పుడు వేయకయు బాలుపిదికి యతఁడు త్రాఁగుచుండును. ఆవులు తమ తమ గృహంబులకుఁ బోయిన తరువాత యజమానులు పాలు పిదుక దమకింప వని పాలియ్యక పోవుటఁజేసి తమ యావులకు దృష్టి తగిలినదనియు దయ్యములు పట్టినవనియు మనోవేదన జెంది దిగతుడుపులు తీసి సోదెకుఁ బోవుచుందురు. వారి కళవళము వారి చిత్తక్షోభము జూచి యేమియు నెఱుఁగనివాఁడు వోలె నటించుచు దన యఖండ ప్రజ్ఞయెగదా వారిని వ్యాకులపెట్టు చున్నదని సగర్వముగ మనంబున గులుకుచుండును. కావలసిన ఖర్చులు చేసికొనుటకు గణపతి చేతిలో డబ్బు కొంచమైనను లేకపోవుట గొప్పవిచారకారణమయ్యెను. మేనమామ డబ్బులు విభూతి బుట్టలో బెట్టుట మానెను. తల్లి గూళ్ళలో వైచుట మానెను. ఏదో నిరంతరము నమలుచుండవలయును కాని, గణపతి నోరూరకుండదు. కొబ్బరి కురిడీలు, శనగయుండలు, పేలవుండలు, తాటితాండ్ర, తేఁగలు, జీళ్లు, శనగపప్పు మొదలైన వస్తువులూరక యిచ్చువారెవ్వరు లేరు. తోఁటలోనికిబోయి మునుపటి వలె దోచుకొని వచ్చుట కంత వీలులేదు. ఏలయన దోఁటకాఁపు లీబందిపోటు దొంగల విషయమై మిక్కిలి జగరూకులై యుండిరి. సూక్ష్మబుద్ధి గలవాఁడగుటచేత గణపతి యావిషయమై కన్నులు