పుట:Ganapati (novel).pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

154

గ ణ ప తి

వర్ణింప బడుటయె గాని కలియుగమం దట్టి రాళ్ళవాన నెవ్వరు జూచి యెరుగరు. ద్వాపరమున నిజముగ నట్టివాన గురిసెనో లేదో చెప్ప జాలము గాని మన గణపతి నిజముగ నెన్నో రాళ్ళవానలు గురిపించెను. మగవారు లేక కేవల మాఁడువాండ్రే యున్న యిండ్లమీఁదను నందు ముఖ్యముగ ముసలియవ్వలున్న యిండ్లమీఁదను గణపతి హస్తములు రాళ్లు విసురుటలో భారత రణమందు గౌరవసేనపై నవలీలగ శరపరంపరలు కవదొనలనుండి తీసి యెడమ లేకుండఁ ప్రయోగించిన యర్జునిని హస్తము దలపించును. ఆ విషయమున గణపతి సవ్యసాచియని చెప్పవచ్చును. తెల్లవారుజామున లేచి చలిదియన్న మారగించి చిన్ని బిన్ని మొదలగు పాటలు పాఁడుకొనుచుండు నాడపడుచు లున్న చోటికి మెల్లమెల్లఁగ జని యేచాటున నుండియో మూఁటవిప్పి పల్లేరుకాయలు తీసి వాళ్ళ కాళ్ళనడుమ జల్లును పల్లేరుకాయ లా కాలునకు గుచ్చుకొని యీ కాలునకు గుచ్చుకొని జవరాండ్రు కళవళము పడి నానాముఖముల బరుగులెత్తుచుందురు. కొందరు తిట్టుచుందురు. కొందఱు తమ మగవాండ్రను బిలిచికొని వచ్చుచుందురు. గణపతి మెఱపుతీగవలె మాయమగును. తన స్నేహితులలో గొందరి వీపులమీద దూలగొండ రాయుచుండును. దురదలెత్తి వారు వీపులు బరికికొని పరుగులెత్తుచున్నప్పుడు మహా నందభరితమై యుండు గణపతి మొగముచూచి తీరవలయును. ఫొటోగ్రాపు లాకాలమందు విరివిగా లేవుగాని యీనాటివలె