పుట:Ganapati (novel).pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

153

రాననిపించి పంపెను. అభిమానవంతుడైన గణపతి యీ పరాభవము తన తోడిదొంగయైన యా బాలునకు దక్క రెండవవానికి దెలియకుండ జాగ్రత్తపెట్టెను. అట్లతద్దియు, నుండ్రాళ్ళతద్దియు వచ్చెనా గణపతి సంతోష మింతింత యని వర్ణింపనలవి కాదు. నాటి మధ్యాహ్నమె కొందఱు స్నేహితులను వెంటఁబెట్టుకొని పొదలలోనికి, రుప్పలలోకి, దుబ్బులలోనికి జని రెండు బుట్టలు పల్లేరుకాయలు, కొంత దూలగొండ, పది యీతజువ్వలు, రెండు బుట్టలు బొమ్మరాళ్లు బెడ్డలు దెచ్చి యొకచోట దాఁచును. రాత్రి భోజనములు చేయగానె పండుకొని తోడి బాలకులందఱుఁ దెల్లవారుజామున లేచుచుండ తాను రెండుజాముల రాత్రివేళనె లేచి తల్లిని మేలుకొలిపి తల్లిసాయమున నిరుగుపొరుగువారి యిండ్లకుఁ బోయి యచ్చటి బాలురను లేపి మరల గృహంబున కరిగి చప్పుచప్పున మొగము గడిగికొని యుల్లిపాయల పులుసుతోను నువుపొడుముతోను, పొట్లకాయ పరమాన్నముతోను, గేదె పెరుగుతోను, భోజనముచేసి కొన్ని పల్లేరుగాయలు మూటగట్టుకొని భుజముపై వైచికొని రాళ్ళబుట్ట యొకటి యెడమచంక నిరికించుకొని నోట చుట్టవెలిగించి కుడిచేత నీతజువ్వ పుచ్చుకొని కేకలు వైచుచు వింతవింత పాటలు పాడుచు వీధులవెంటఁ దిరుగును. ద్వాపరయుగమునం దెన్నడో శ్రీకృష్ణుని మీది యాగ్రహముచే దేవేంద్రుడు రాళ్ళవాన గురిపించెనని భాగవతము హరివంశము మొదలగు మహాపురాణములయందు