పుట:Ganapati (novel).pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

14

గ ణ ప తి

లానామమిచ్చి యండవచ్చు. ఒక్కవిషయమున దక్క యితఁడన్నివిషయముల గణపతికిఁ దుల్యు డనవచ్చును. మహాగణపతి విద్యల కధిపతి, మన గణపతి కదొక్కటే కొఱత. ఇట్ల నుటచేత నితఁడు చదువు రానివాఁడని తలంపవద్దు. ఆ కొరత దీర్చుకొనుటకై యతఁ డుపాధ్యాయత్వముఁ జేసి కొందరు బాలుర బాగుచేసెను. తాను గ్రంథములు చదువుకొనుటకు విద్య రాదు. కాని యొకరికి చెప్పుట కతనియొద్ద నెంత విద్యయైన గలదు. కాని యెకరికి చెప్పుట కతనియొద్ద నెంత విద్యయైన గలదు. ఏవంగుణ విశిష్టుఁడైన గణపతియొక్క చరిత్రమునం దుపోద్ఘాతము వ్రాయఁబడినది. ఈ యుపోద్ఘాతము చదువగానె వాని చరిత్రము నామూలాగ్రముగ జదువవలయునని మీ మనస్సులు, వినవలయునని మీ చెవులు నువ్విళ్ళూరుచుండ వచ్చును. అందుచేత నామధేయ ప్రకరణమును విడిచి వంశరూపధేయాది ప్రకరణములయందు బ్రవేశింతము. గణపతి చరిత్రము మిక్కిలి గొప్పది. ఇది చదువరుల యదృష్టముచేత మాకు లభించినది. వాల్మీకి కిట్టి చరిత్ర దొరికిన పక్షమున రామాయణమును మాని యత డా కథయే వ్రాసి యుండును. వేదవ్యాసున కిట్టిది లభించిన పక్షమున కష్టసాధ్యములైన పదునెనిమి పురాణములను, మహాభారతమును రచియించుట మాని తన యశస్సు కల్పాంతస్థాయి యగునట్టు లా చరిత్రమునే రచియించి కృతార్థుఁడై యుండును. ఇంకఁ గాళిదాస భవభూతి ప్రముఖుల మాట చెప్పనేల! ఇటువంటి చిత్రకథ శ్రవణగోచరము గాకపోవుటచేతనే