పుట:Ganapati (novel).pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

147

మ్రొక్కి తన్ను వేఁడ కరుణాళువై వెన్నముద్దవలె యా విషపు ముద్దను మ్రింగి యత్తరి నప్పాలసంద్రమునఁ బుట్టిన గల్పవృక్షమును నైరావతమును నుచ్ఛైశ్రవము నింద్రునికిచ్చి లక్ష్మీకౌస్తుభముల విష్ణునకిచ్చి తన లోకాపకార శీలతయు నిస్పృహత్వమును వెల్లడి చేసెను. అట్టి మహనీయు డెద్దెక్కుట బాగున్నదా? ఈయన కుమారుడఁగు కుమారస్వామి జగత్రయ కంటకుఁడగు తారకాసుని శక్తిప్రయోగమున సంహరించి వేల్పుల కృతజ్ఞతకుఁ బాత్రమయ్యెను. ఇతఁడు క్రౌంచ పర్వతము భేదించిన మహా యోధుఁడు. అతఁడు దేనిమీఁద నెక్కునో యెఱుఁగుదురా? నెమలిమీఁద వన్నెల చిన్నెల బండారమే కాని నెమలి గొప్పయేమున్నది? బ్రహ్మదేవుఁడు చతురాననుఁడఁట. సురజ్యేష్టుఁడఁట, హిరణ్యగర్భుఁడఁట, ప్రజాపతియఁట, వాణీ నాథుఁడఁట, సృష్టి కర్తయట. వానచుక్కలు మీఁదఁ బడిన మాత్రాన తోఁక త్రెంచుకొని పాఱిపోవు హంస వీని వాహనమఁట. మహిషాసుర మర్దిని యగు కాత్యాయని సింహ మెక్కును. నిగ్రహానుగ్రహ సమర్థులు, నిరుపమాన మహిమాన్యులు, కళ్యాణ గుణ సంపన్నులు, కామరూపులు, సకలలోక పూజ్యులు, సరధర్మ పరి జ్ఞాతలు నైన దేవతలె గొఱ్ఱెనెక్కి, బఱ్ఱెనెక్కి, యెలుకనెక్కి, యెద్దునెక్కి, గ్రద్దనెక్కి, మఱియు నిచ్చవచ్చిన జంతువులనెక్కి పులుఁగులనెక్కి బెదురులేక బిడియము లేక సిగ్గులేక చింత