పుట:Ganapati (novel).pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

145

అట్లు మీరు తలంచుట న్యాయము కాదు; ఏలయన, నిట్టివా రనేకులు గలరు. ఎవరి మాటయొ యెందుకు. అసాధరణ ప్రతిభా సమేతులగు దేవతలం జూడుఁడు. దేవతలకెల్ల దొరయై ముజ్జగంబుల యేలికయై కల్పవృక్షము కామధేనువు చింతామణి మొదలగు కామప్రధాన పదార్థముల కొడయఁడైన నిర్జరేంద్రునకు మేఘములు వాహనములు. నీరు గాలి మెఱుపు పొగ మొదలగు పదార్ధములతోఁ జేయఁబడిన మేఘమా యతనికి వాహనముగ నుండవలసినది. తక్కిన వేల్పులం జూడుఁడు. సకల యాగములకు సకలస్మార్త కర్మలకు నాధారమైన యగ్ని హోత్రునకు వాహనము గొఱ్ఱె. దక్షిణ దిక్కునకు నాయకుడైన యగ్ని హోత్రునకు వాహనము గొఱ్ఱె. దక్షిణ దిక్కునకు నాయకుఁడై ధర్మాధర్మ విచార నిపుణుఁడైన యమధర్మరాజునకు వాహనము దున్నపోతు; జలాధినాయకుఁడైన వరుణుఁడు మొసలిపై నెక్కును. మహాబలుఁడై సముద్ర జలముఁ బై కెగర గొట్టియు మహావృక్షములఁ గూల్చియు క్షణకాలమున జగన్నిర్మూలనము జేయఁగల వాయుదేవుఁడు లేఁడిమీఁద స్వారిజేయును. "ఆదౌ పూజ్యో గణాధిపః" యన్నట్లు సకల శ్రౌతస్మార్త కర్మలకు ముందు పూజనీయుఁ డగు గణాధిపతి యెలుక నెక్కి పందికొక్కునెక్కి బయలు దేఱును. ఉమా మహేశ్వరులకు కుమారుఁడైన గణపతి కింతకంటె వేరు వాహనము లేకపోయెనా? కొంపత్రవ్వునట్టి యెలుకా వాని తురంగము. సకల గృహవర్తి యగు మార్జాల చక్రవర్తి కొక్క కబళముగ నుపయోగపడు నెలుక