పుట:Ganapati (novel).pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

143

కాలమురా, ఏనుగు నెక్కినవారున్నారు. గుఱ్ఱము నెక్కినవారున్నాదు. కాని బ్రాహ్మణకులములో బుట్టినవాఁడు గాడిద నెక్కగా నెక్కడ జూడలేదు. నీ మూలమున దనకెంతో యప్రతిష్ట వచ్చుచున్నదని నీ మేనమామ యేడ్చుచున్నాడు. ఈ పాడుబుద్ధి నీ కెవరైన నేర్పినారా నీకే బుట్టినదా. ఇటువంటి యవకతవక పనులు మాని తిన్నగా నడచుకొంటివా మీమామతోఁ జెప్పి నిన్నింటికి జేర్చెద" మని మందలించిరి. అనవుడు గణపతి నవ్వి వారి కిట్లనియె. "అయ్యా ! గాడిద నెక్కిన దప్పేమున్నది? భాగ్యవంతుడు వరియన్నము దినును. పేదవాడు జొన్నకూడు తినును. అగ్రహారీకు లంటు మామిడి పండ్లు తిందురు. పేదవాఁడు జీడిమామిడిపండ్లు తినును. అలాగే యెక్కువ డబ్బున్న రాజేనుఁ గెక్కును. కొంచెము డబ్బున్న వాఁడు గుఱ్ఱ మెక్కును. గవ్వైన లేనివాఁడు గాడిద నెక్కును. దానికి దీనికి భేదమేమి? గుఱ్ఱము సకిలించును. గాడిద యోండ్రము పెట్టును. దీనికికూడ జీనువైచి కళ్ళెము పెట్టి డెక్కల కినుప నాళములు వేయించి నడక నేర్పించి ముద్దుచేసిన పక్షమున గుఱ్ఱమును మించియె యుండును. పనికి మాలినదని పదిమంది పేరుపెట్టినచో నది పనికిమాలినదె యగును. గాడిదె నెక్కుట వలన గొప్పలాభ మున్నది. అదియేది యనగా, ముందు గాడిదె మీద స్వారీ నేర్చుకొన్న పక్షమున గుఱ్ఱపు స్వారి సులభ మగును. ఇవి యన్నియు నటుండనిండు. గాడిద యెంత గొప్పదో మీ రెఱుఁగుదురా ? శ్రీకృష్ణమూర్తి వారి