పుట:Ganapati (novel).pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

136

గ ణ ప తి

అందుచేత నతఁడు బొగచుట్టలే కాల్చువలయునని నిశ్చయించుకొని యనుభవముగల స్నేహితులతో నాలోచించి పాటియాకు మిక్కిలి గాటుగానుండి వికారపెట్టును. కావున గాటు తక్కువగ నున్న లంకాకుచుట్టలు కాల్చుట మంచిదని యొక స్నేహితు నడిగి యొక చుట్ట బుచ్చుకొని కాల్చెను. అది వికారపెట్టెను. వమనమయ్యెను. మిత్రు లతని నొక చాపమీఁద బండుకొనబెట్టి కొంచెము చింతపండు దెచ్చి యతని నోటవైచి యుపచారములు జేసిరి. వికారపెట్టినదికదా, ఇది స్పృశింప గూడదని గణపతి తలంపలేదు. తన సంగడి కాండ్రందఱు వికారము లేకుండ యధేచ్చముగ గుప్పుగుప్పన లంకాకు చుట్టలు బాటియాకు చుట్టలు కాల్చి సుఖించుచుండగా వికారపెట్టినదని తన యొంటికి సరిపడదని తా నది కాల్చుట మానిన పక్షమున మిత్రమండలిలో దన కప్రదిష్ట సంభవిల్లునని తన్న ప్రయోజఁకుడనుకొందురని భయపడి యశఃకాముఁడగుటచే నెట్లైన వీఁడు చుట్టలు కాల్చుటలో దిట్టయని పేరు సంపాదింపవలయునని నిశ్చయించి కుశాగ్రబుద్ధి యగుటచే నట్లు నిరంతరాయముగ చేయుట కుపాయములు వెదకెను. తదేకధ్యానముతో నున్న యా బుద్దిమంతుని కొక యుపాయము బొడగట్టెను. వికారపెట్టినప్పుడు మొదటనె పాత యుసిరిక పచ్చడి కాని రెండేండ్లనాటి నిమ్మకాయ ముక్కగాని నార దబ్బకాయ ముక్కకాని పాతచింతకాయ పచ్చడికాని నోటిలో వైచుకొన్న పక్షమున వికారమడఁగునని గ్రహించి