పుట:Ganapati (novel).pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

135

లేదు. చూడని మాటలు మన మనగూడదు. దుండగుఁ డగుట చేత వీఁడే పాపములకెల్ల భైరవుఁ డని యపవాదము వచ్చు చున్నది. విఘ్నేశ్వరుని చవితినా డక్షతలు నెత్తిమీఁద వైచికొనకుండ ముందుగా జంద్రుఁని జూడవద్దని నేనెన్ని మాట్లు చెప్పినను వినఁడు. విన నందుకు దానిఫల మనుభవించుచున్నాడు. ఇంతకు నేను చేసికొన్నపాపము. లేకలేక వంశాన కొక్కఁడు పుట్టినాడు వానిమీఁద దొంగతనములు వచ్చిపడుచున్నవి. నేనేమి చేయగల" నని యుత్తరము చెప్పెను. "సరే ముందు ముందు నీకే తెలియగల" దని సోదరుఁ డూరకుండెను. తల్లియు మేనమామయు డబ్బులు జాగ్రత్త పెట్టి దాఁచుకొన జొచ్చిరి. అప్పుడు పేకాటకు పైకము దొరకక గణపతి పొరుగిండ్లకుఁ బోయి యధాసందర్భముగ దొరికినంత వఱకు హస్తలాఘవము చేసి యాటలలో పడిన ఋణము దీర్చి కృతకృత్యుఁ డగుచు వచ్చెను. పేకాటలోని స్నేహితులు చాలమంది పొగచుట్టలు కాల్చువారగుటచేత గణపతిగూడ చుట్టలు కాల్చవలయునని సరదా పుట్టెను. ముందుగా సరదా తీర్చుకొనుటకై గోగుపుల్లలు కాల్చెను. తరువాత నచఁటి చొరుగు చుట్టలుచుట్టి కాల్చి కొంతవఱ కుత్సాహము దీర్చికొనియెను. కాని మిత్రులందఱు బొగచుట్టలు కాల్చుచుండగాఁ దానచఁటి చొరుగు చుట్టలు కాల్చుట తన కెంతో యవమానకరముగ నుండెను.