పుట:Ganapati (novel).pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

12

గ ణ ప తి

నాల్గవ లక్షణము. సామ్యములైన లక్షణములు గణపతుల కిద్దఱకు మూఁడు కలవు గాని మా గణపతి యా గణపతికంటె నెన్నో విషయములయందు ఘనుఁ డని చెప్పవచ్చును. బొజ్జ విషయములో మా గణపతి యగ్రతాంబూలామున కర్హుడని పండితు లెందరో సెలవిచ్చియున్నారు. లంబోదర శబ్దము విఘ్నేశ్వరునకు నేతిబీరకాయవలె సార్థకము గాదనియు మా గణపతియందు లంబోదరత్వము సార్థకమైన దనియు నా దృఢవిశ్వాసము; విఘ్నేశ్వరుఁ డేకదంతుడు, మా గణపతి ముప్పదిరెండు దంతములు గలవాఁడు. స్థాలీపులాక న్యాయముగఁ బైనుదహరింపబడిన కొన్ని యతిశయలక్షణములు జూపఁబడియె. మహాగణపతికి సమానములైన లక్షణములు కొన్ని, యతనికంటె నతిశయములైన లక్షణములు యుండుటచేత మొత్తముమీఁద గణపతి శబ్దము మా కథానాయకునియందు కొంతవఱకు సార్థకమైన దని మీకిప్పుడు నమ్మిక కలిగియుండవచ్చును. జగదారాధ్యుఁడైన వినాయకునియందు గల లక్షణంబులె తమ ప్రియపుత్రునియందుఁ గలుగునని నమ్మి తలిదండ్రులా నామ మతని కిచ్చి యుందురాయని మమ్మడుగ వచ్చును. దాని కుత్తరముఁ జెప్పుట మిక్కిలి కష్టము, తల్లిదండ్రులు బిడ్డల కొకప్పుడు తమ యిష్టదైవతముల పేర్లు పెట్టవచ్చును. ఆ దైవతముల యుందున్న గుణములు బిడ్డలయందు పొడగట్టవచ్చును. పొడగట్టక పోవచ్చును. రాముని నామము ధరించిన వారందఱు బితృవాక్య