పుట:Ganapati (novel).pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

127

మరి యేరోగమైన దెప్పించి చంపితివా నీకు బలిసిన కోళ్ళను రెంటిని యెత్తుకువచ్చి బలి యిచ్చెదను. లేదా ముష్టియెత్తియైన మంచి మేఁకపోతును బలియిచ్చెద" నని దండముపెట్టి మ్రొక్కుకొనెను. కాని ఆ యమ్మవారి కతఁ డేమి విషము పెట్టెనో కాని యతని మ్రొక్కులు సరకు గొనక పంతులు జోలికి పోక యారకుండెను. ఎన్నోమారులు చలిది నైవేద్యములు వేఁడి నైవేద్యములు చలిమిడి పానకములు గ్రహించి యొకటి రెండుసారులు గరగలుకూడ గైకొని యాదేవత యవసరము వచ్చినపుడు కృతఘ్నురాలై తన పనిచేయక తనయెడ ననాదరణము చూపినందుకు గణపతి కెంతో కోపము వచ్చినది కాని యమ్మవారగుట చేత తనకేదేని యాపదగలిగించునను భయముచేత నామెను దూషింపక యూరకుండెను. బడికి వెళ్ళవలసి వచ్చినప్పుడు కడుపునొప్పి బాధ నభినయించి యూరక వామురసము శొంఠిరసము ద్రాఁగుచుండును. తలనొప్పి లేకపోయినను రెండు కణతలు పట్టుకొని చాలభాధ నభినయించి కణతలకు శొంఠి గంధము మెత్తును. బడికి బోవకుండుటకై యత డెన్నోసారులు రోగము పేరుచెప్పి మిరియాల రసముగూడ ద్రాగెను. ఒకనాడు గణపతి నడుము నొప్పియని బడిమానగా మేనమామ చిత్రమూలరసము తీయించి పట్టు వేయించెను. దాని మంట కయిన నతఁడు సహించెను కాని బడికి పోవుట కిచ్చగింపఁడయ్యె. ఒకటి రెండుసారు లాదుండగుఁడు గాజు పెంకుతో