పుట:Ganapati (novel).pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

125

సంతోషించెను. గణపతిని బడి కంపుట తల్లికి, మేనమామ నష్టకష్టములలో నొక కష్టమయ్యెను. గణపతి పాఠశాలకు బోవు నప్పుడు జరిగెడు నుత్సవమును భాగవతము, జలక్రీడలు మొదలగు నాటలు జూచుటకు బోయినట్లె పోయి యూరులో ననేకులు తీరుబడి చేసికొని చూచి సంతోషించుచుందురు. గణపతి యాకారము చేతను వయస్సు చేతను మిక్కిలి కుఱ్ఱవాఁడైనను వానిని బడి కొక్కడు తీసికొని పోవజాలఁ డయ్యెను. ఆ పని తల్లికి సాధ్యము కాకపోయెను. పంతులుగారు చింతబరిక పుచ్చుకొని ప్రతి దినము నుదయమును సాయంకాలమునను బొరియలవంటి నలుగురు పిల్లలను వెంటబెట్టుకొని రావలయును. ఆ నలుగురు యజ్ఞపశువును బడద్రోసినట్లు గనపతిని నేలబడద్రోసి కాళ్ళిద్దరు చేతులిద్దరు బట్టుకొని తీసుకొని పోవుచుందురు.

గణపతి సమయోచితముగ వీలువెంబడి తన పాలిటి యమ కింకరులవంటి యానలుగురు పిల్లలను గోళ్ళతో బరికియు గిల్లియు వాడి పండ్లతో గరిచియుఁ గాళ్ళతో దన్నియు నిట్టట్టు విసిరి తలతో గొట్టియు మీఁద నుమిసియు నోటికి వచ్చినట్లు తిట్టియు నూరందరు జేరునట్లు కేకలు వైచియుఁ పూట పూటకొక నాటక మాడుచుండును. పంతులుగారు వజ్రాయుధమువంటి చింతబరికెలతో నెడనెడ వీపుమీద సమయోచితముగ వడ్డించుచుండును. బరకులు కరపులు తన్నులు, గిల్లులు మొదలగు బహుమానములలో గురువు