పుట:Ganapati (novel).pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

124

గ ణ ప తి

గంగాధరున కుత్తరక్రియలు బాలకుని మీఁదనె కర్తవ్యము పెట్టి మేనమామ చేసెను. గంగాధరుని యొద్ద నున్నఁ ధన మతఁడుండఁగానే చాల మటుకు వ్యయమయ్యెను. మిగిలిన దతఁడు పోయిన సంవత్సరము లోపుననె కర్చుపడెను. సంసారము మొదటికి వచ్చెను. గణపతి మాతృసమేతముగ మేనమామ యింటనె ప్రవేశించెను. అతని స్థితి కొంచెము బాగుండుటచే నతఁడు మేనల్లుని దోబుట్టువును గొంతకాలము పోషింప గలిగెను. గణపతికి గర్భాష్టమం దుపనయనము జరిగెను. బలిచక్రవర్తిని వంచించుటకై పూర్వకాలమవతరించిన వామనమూర్తియొక్క యవతార మన్నట్లు, కర్కోటకుడు కఱచినపిదప బాహుకుండను పేరుతో ఋతుపర్ణు నాశ్రయించి యున్న సాక్షాన్నల రూపమట్లు చూచువారి కెంతో నవ్వుపుట్టించుచు గణపతి భూమికి జానెడై వడకపెండ్లికొడుకై పీటలమీఁదఁ గూర్చున్నప్పుడు చూచినవారిదె యదృష్టము. గాయత్రీ మంత్ర మతనినోట నుచ్చరింపఁజేయుట పురోహితుని తరమైనది కాదు. గాయత్రీ మంత్రము వచ్చుగాక రాకపోవుగాక మెడలో జందెము పోగులు మాత్రము పడెను. అక్షరాభ్యాస మైదవయేటనే యైనను నుపనయనమైన తరువాతనె గణపతిని బడికి పంపించిరి. చదువు సంధ్యలు రెండును సమానముగానె వచ్చెను. గణపతియొక్క తెలివితేటలకు గాయత్రి మంత్రముపదేశించు నపుడు పురోహితుఁ డెంత సంతోషించెనో యోనమాలు చెప్పునపుడు వ్రాయించునపుడు పంతులుకూడ నంతే