పుట:Ganapati (novel).pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

123

వంటి జాతకము నే నెక్కడ చూడలేదు సుమీ, మీయింట నిక నెవరికి గండములు లేవు. ఉన్న గండమేమో ముసలమ్మ మీద కొట్టుకొని పోయినదని స్తుతించి సంతోషపఱచి పంపెను. గంగధరుఁడు తనకొడు కేరాజు నొద్దనైన మంత్రియే యగునో లేక చతుశ్శాస్త్ర పండితుఁడే యగునో ధనము సంపాదించి కోటికి పరుగెత్తునో సర్కారువారియొద్ద గొప్ప యుద్యోగము చేయునో యేదో గొప్ప యైశ్వర్యము కుమారున కున్నదని పలుకుచుఁ దన యింట నెవరికి మఱి గండములు లేవని చెప్పినందుకు మిగుల సంతుష్టి నొందుచు జాతకమున్న తాటియాకు నింటికి బోయి పడమటింటి వసారా చూరులో విభూతిబుట్ట కట్టిన చోటునకు సమీపమున దోసెను. జోగావధానులుగారి జ్యోతిష్యము గణపతి విషయమున మిడతంబొట్టు శకునము వలె గొంతవరకు నిజమయ్యెను. దేశదేశములయం దతడు ప్రఖ్యాతుఁడగు నను మాట యక్షరాల నిక్కమయ్యెను. ఇఁక మీద గండములు లేవని యాయన చెప్పిన మాటమాత్ర మబద్ధమయ్యెను. వరప్రసాదివలె జనియించిన యీ కుమారుని ముద్దు ముచ్చటలు కన్నులార జూచి యానందించుటకును జాతకములో సూచింప బడిన ప్రకారము కుమారుఁడు ప్రసిద్ధి పురుషుఁడై యుండగా గనుగొను భాగ్యము గంగాధరునకు లభియించినది కాదు. గణపతికి నాలుగేండ్లైన నిండక మునుపే గంగాధరుఁడు మృతి నొందెను. గణపతి కప్పటి కుపనయనము కాకపోవుటచే