పుట:Ganapati (novel).pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

119

జేయనివా రెవ్వరుందురు? పండితరాయలని ఢిల్లీశ్వరునిచేత బిరుదు పొందిన జగన్నాధ పండితుడు చెప్పినట్లు మహోన్నత వృక్షశాఖలు పీఠములుగ కిచకిచలు సరససల్లాపములు బరుకులు కరపులు బంధు సత్కారముగఁ దోటలలో దొడ్లలో గొలువు దీర్చియుండు నీ కిష్కింధా పురాగ్రహా రీకుల మొగము లెవ్వ రెఱుంగరు? మానవజాతికెల్ల మూల పురుషుఁ డని ప్రకృతి శాస్త్రజ్ఞలచే నిర్ణయింపఁబడి కళత్ర వియోగముచే నంతరాయము లేని యలమట నొంది రఘురామునకు సముద్ర బంధన మందును, లంకా విజయము నందును రావణ కుంభకర్ణాది దుష్టరాక్షస సంహార మందును మిక్కిలి తోడ్పడి చాంచల్యమున కెల్ల నిలయమైన యా మర్కటము నొక్కమారు స్మరియింతురేని మీకిహ పరములు రెండును గలవు. ఇహ మెట్లు కలుగును, పరమెట్లు గలుగునని మీకు సందేహము దోఁచ వచ్చును. పరబ్రహ్మ స్వరూఁపుడని ప్రాచీనులచే వర్ణింపబడి శ్రీరాముని సేవకులని దలఁచుకొన్నంత మాత్రమున మీ పాపపుంజము భస్మపటల మగును. ఇదే పరము. ఇహమనేది యన, మర్కట రూపము మనసున నిల్చినంత మాత్రమున మన కధానాయకుని రూపు రేఖా విలాసములు కొంతవఱకు దేటపడవచ్చును. ఒక కొండముచ్చున్నదని కొనుఁడు; తోక లేదను కొనుఁడు. అది మనుష్యాంగన యొడిలో నుండి పాలుద్రావుచున్న దనుకొనుఁడు. అది చెట్టు కొమ్మ మీఁద గాక