పుట:Ganapati (novel).pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గ ణ ప తి

11

పతి యనఁగా విఘ్నేశ్వరుఁ డగుటచేత విఘ్నేశ్వరు నుద్దేశించి చెప్పఁబడిన పూర్వోదాహృతశ్లోకముయెక్క విపరీతార్థము నీ గ్రంథ కథానాయకుఁడైన మా గణపతి కన్వయింపఁజేయ వలదని కోరుటకై యాశ్లోక ముదహరించితిని. ఆ గణపతి ప్రమథగణపతి గదా, మా గణపతి యే గణమున కధిపతి యని మీ రడుగవచ్చును. అది నేను చెప్పుట కష్టము. మీరే యూహించుకొనవచ్చును. తల్లిదండ్రు లితనికి గణపతి నామ మేల పెట్టిరో నాకు తెలియదు, కాని గణపతి నామ లక్షణము లనేకము లీతనియందు, కాని గణపతియందుండు లక్షణము లనేకము లీతనియందు గలవు. ఉండ్రములమీఁద నతని కెంత యిష్టము గలదో వర్ణించుటకు సపాదలక్షగ్రంథముగల మహాభారతము రచించిన వేదవ్యాసుడు దిగి రావలయును గాని సాధారణకవులు సామాన్య వచన గ్రంధ ప్రణేతలు పనికిరారని కంఠోక్తిగాఁ చెప్పగలను. అది మొదటి సామ్యలక్షణము. పానకము, వడపప్పు, కొబ్బరికాయలు మా గణపతికి కావలసినన్ని దొరకవు గాని దొరికినపక్షమున దక్కిన ప్రజ్ఞావిషయమున కాకపోయినను భోజనవిషయమున మహాగణాధిపతిని మా గణపతి యవలీలగ జయింపఁగలడు. ఇది రెండవ లక్షణము, మహాగణపతిది గుజ్జురూపమే యని శపథముఁ జేసి చెప్పగలను, ఇది మూడవ లక్షణము. ఆ విఘ్నేశ్వరుని దేనుఁగు మొగము, మా గణపతిది యేనుగు మొగమువంటి బుంగ మొగము, ఇది