పుట:Ganapati (novel).pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

కారక మనియు దానివలన నెన్నో ప్రయోజనములు కల వనియు నప్పుడు గంగాధరుడు తన చుట్టుజేరిన బంధుగణము నకు జెప్పి చక్కని లంకాకుచుట్టలు హోమము జేసినపక్షమున దేవతలు సయితము దానివాసనలకు సొక్కి మనము చెప్పినట్లు విందురని యుపన్యసించి దాని రుచి దాని వాసన దానిషోకు నెఱుగని పరమ శుంఠలు గొందఱు వైదికులు తప్పందురు. కాని దాని సారస్య మెఱిఁగిన వారు దానిని మెచ్చుకొని యుందుదురని వక్కాణించి యదివర కలవాటు లేని వారందఱు నింకమీఁదనైన యలవాటు చేసికొని సౌఖ్యమనుభవించ వలసినదని హెచ్చరించి కట్టకడపట నిట్లనియెను. "నాకే శంకరాచార్య స్వాములవారి యధికార మున్నపక్షమున చుట్టకాల్చని చచ్చువెధవ లందఱిని వెలి వేయక పోదునా? ప్రతిదొడ్డిలోను పొగాకు మొక్కలు నాటించనా? చుట్ట కాల్చినవారి శరీరము వజ్రశరీర మగును. వాని కెప్పుడు రోగమురాదు. లంకపొగాకు కషాయము కాచి మూఁడు పూటలిచ్చిన పక్షమున యజ్ఞములు చేసిన సోమయాజులు వారికి శాస్త్రులవారికి ఛాందసము వదలిపోవును."

పెండ్లి సలక్షణముగ జరిగెను. పరిణయా నంతరమున గంగాధరుఁడు కాకినాడకు బోయి యెప్పటియట్ల తన వృత్తి యందుండెను. కాలక్రమమున సింగమ్మ బాలారిష్ట దోషములు గడచి పదమూఁడవ యేట రజస్వ లయ్యెను. ఏబదిమూఁడవ యేట గంగాధరునకుఁ పునస్సంధాన మయ్యెను.