పుట:Ganapati (novel).pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

114

గ ణ ప తి

నియు నెంచికొనుచు నింటికిఁ బోయెను. రాజభటు లరిగిన తరువాత కొందరు జూదరు లా శవమునకు రాళ్ళుగట్టి సముద్రములో పారవైచిరి. అదియెల్ల గంగాధరుఁడు చూచుచు నూరకుండెను. ఆ కార్యము వలదన్న పక్షమున వారు తన్ను గూడ చంపుదురేమో యని శంకించి నోరు మూసికొని యూరకుండెను. శవమును బాఱవైచి జూదగాం డ్రొకఁడు పోయిన దెస కొకఁడు పోవక జారిరి. అందఱు వెళ్ళినతరువాత గంగాధరుఁడు మిక్కిలి భయపడుచు మాటిమాటికి వెనుకకు ముందునకు జూచుకొనుచు నులికిపడుచు జగన్నాయకపురము దాటి కాకినాడ వెళ్ళి యొక యరుగుమీదఁ బండుకొని నిద్రపట్టక కాఁపువాని విగ్రహమె మాటిమాటికిఁ గన్నులముందర గనబడ వెరగందుచు లేచి కూర్చుండి తెల్లవారునఫ్పుడేటికిఁబోయి స్నానముచేసి యా దిన మన్నము దినక యే పనియుఁ జేయజాలక జబ్బుగానున్నదని ముసుగు పెట్టుకొని పండుకొని "యిక ముందెన్నడు జూదమాడకూడదు. నాయెత్తు ధనముపోసినను జూదపు బాకలోనికి వెళ్ళఁగూడదు, నేటితో నాకు బుద్ధివచ్చిన" దని నిర్ధారణము జేసికొనియెను. చేసికొనుటయేగాదు ఆనిర్ధారణము ప్రకారము యావజ్జీవము నడచుకొనియెను. ఎప్పుడైన జూదముమీద ధ్యానము పారెనా నాటిరేయి దారుణకర్మ యతనికి జ్ఞాపకమువచ్చి యా సంకల్పము మరల్చుచుండును. సింహాచలము మృతినొందుట చేతను జూదముమీఁద వైరాగ్యము పొడముటచేతను వివాహము